Sunday Special Chicken Pakodi Recipe : ఆదివారం ఇంట్లో టేస్టీ ఫుడ్ ఉండాల్సిందే. వారమంతా వివిధ పనులతో బిజీగా ఉండే పిల్లలు, పెద్దలు ఆదివారం పూట ఇంట్లో మంచి టేస్టీ ఫుడ్ పెట్టుకుని సినిమాలు చూస్తుంటారు. అయితే ఇంట్లోని ఆడవారికి సెలవు ఇచ్చి మీరేమైనా టేస్టీ రెసిపీ చేయాలన్నా.. ఇంటిల్లిపాదికి తమ చేతులతో వంట చేసి తృప్తిగా పెట్టాలనుకునే ఆడవారైనా ముందుగా వెళ్లేది చికెన్ దగ్గరికే. ఎందుకంటే సండే రోజు ముక్కలేనిదే ముద్ద దిగదు అనే బ్యాచ్‌నే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే మీ సండేని రుచిలో, వాసనలో పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లగలిగే చికెన్ పకోడి రెసిపీ ఇక్కడ ఉంది. దీనిని తయారు చేయడం కూడా చాలా అంటే చాలా సులభం. పైగా దీనిని తయారు చేసుకునేందుకు గరం మసాలాను కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఇది మీ పకోడిని టేస్టీగా మార్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చికెన్ పకోడిని ఎలా తయారు చేయాలో.. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గరం మసాలా కోసం కావాల్సిన పదార్థాలు
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 2 అంగుళాలు
లవంగాలు - 6
యాలకులు - 4
జీలకర్ర - అర టీస్పీన్
ఈ గరం మసాల దినుసలను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. గరం మసాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల మీ వంటలకు రుచి మరింత పెరుగుతుంది. ఇది మీ డిష్‌కు మంచి టేస్ట్‌ను అందిస్తుంది.
చికెన్ ఫ్రై కోసం కావాల్సిన పదార్థాలు
చికెన్ - అరకేజి (బోన్‌లెస్ చికెన్)
నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - ఒకటిన్నర టీ స్పూన్
ఉల్లిపాయ - 1 పెద్దది (చిన్న చిన్నముక్కలుగా కోసి పెట్టుకోవాలి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
సాల్ట్ - తగినంత
పెరుగు - 2 టేబుల్ స్పూన్స్
మొక్కజొన్న పిండి - 3 టేబుల్ స్పూన్స్
నూనె - డీప్ ఫ్రై చేయడానికి తగినంత
తయారీ విధానం
ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని దానిలో చికెన్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ధనియాల పొడి, సాల్ట్, మిరియాల పొడి, పెరుగు, నెయ్యి, కరివేపాకు వేసి బాగా కలపాలి. పొడులు అన్ని చికెన్‌కి బాగా పట్టేలా చేతితో కలపాలి. దీనిలో కార్న్ ఫ్లోర్ వేసి.. కలపాలి. ఇది చికెన్‌కి మంచి లేయర్ ఇస్తుంది. అంతేకాకుండా క్రిస్పీగా చేస్తుంది. మిశ్రమం కాస్త డ్రైగా ఉంటే.. కొంచె నీళ్లు చల్లుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మీరు ఓ గంట మేరినేట్ చేసుకోవాలి.
ఫ్రై చేసే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. అది వేడి అయ్యాక దానిలో చికెన్ వేసి.. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. మంట ఎప్పుడూ మధ్యమంగానే ఉంచుకోవాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత బయటకు తీయాలి. ఈ వేడి వేడి చికెన్ పకోడిని ఫ్రెష్ నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే మీ సండేకి ఇంకేమి కావాలి చెప్పండి.
Also Read : కాంచీపురం ఇడ్లీ.. రెసిపీ వెరీ డెడ్లీ