Israel Gaza War:


పాలస్తీనా ప్రధానితో జైశంకర్ ఫోన్ కాల్‌ 


భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ పాలస్తీనా ప్రధాని మహమ్మద్ ష్టేయా (Mohammad Shtayyeh)తో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య యుద్దం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన గాజాలోని పరిస్థితులను ఆరా తీశారు. గాజాపై ఎడతెరపి లేకుండా దాడులు చేస్తూనే ఉంది ఇజ్రాయేల్. ఈ మేరకు జైశంకర్ అధికారికంగా ట్వీట్ చేశారు. ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంపై (Israel-Hamas War) ఇప్పటికే పార్లమెంట్‌లో స్పందించారు జైశంకర్. గాజాలోని పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు పరిస్థితులు అదుపులోకి తీసుకురావాల్సిన అవసరముందని, రెండు వైపులా సంయమనం పాటించాలని సూచించారు. ఈ యుద్ధానికి శాంతియుత పరిష్కారం అవసరమని స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం ద్వారా ఈ యుద్ధాన్ని ముగించాలని తెలిపారు. పార్లమెంట్‌లో లిఖిత పూర్వకంగా ఈ వివరణ ఇచ్చిన మరుసటి రోజే పాలస్తీనా ప్రధానితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 


"పాలస్తీనా ప్రధానితో ఫోన్‌లో మాట్లాడాను. గాజాతో పాటు వెస్ట్‌బ్యాంక్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన చెప్పారు. పాలస్తీనా విషయంలో భారత్‌ వైఖరి ఏంటో స్పష్టంగా వివరించాను. ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరింపేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాను. గాజాలోని పౌరుల భద్రత పట్ల మాకూ ఆందోళనగానే ఉంది. చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరముంది"


- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి


శిథిలమైన గాజా..


మరో కీలక విషయం కూడా వెల్లడించారు జైశంకర్. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడి చేయడాన్ని భారత్ ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు. అటు ఇజ్రాయేల్ మాత్రం హమాస్‌ని అంతం చేసేంత వరకూ యుద్ధం ఆపేది లేదేని స్పష్టం చేసింది. మధ్యలో వారం రోజుల పాటు కాస్త విరామం ఇచ్చి బందీలను అప్పగించుకున్నాయి రెండు వర్గాలు. ఆ తరవాత మళ్లీ యుద్దం మొదలైంది. గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయేల్. ఇప్పటికే ఆ ప్రాంతం శిథిలమైపోయింది.