Bharat Ratna PV Narasimha Rao :   ప్రధాని పదవిని అలంకరించిన తొలి దక్షిణ భారతీయులు, ఒకేఒక తెలుగువారు పీవీ నరసింహా రావు. 1991 నుండి 1995 వరకు ఆన ప్రధానిగా ఉన్నారు. బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు బీజంవేసిన అపర చాణక్యులు. కుంటుతున్న భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరణ విధానాల ద్వారా పట్టాలెక్కించిన వారు. నాడు తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపంచారు. మన్మోహన్ సింగ్ సహకారంతో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల దేశం ముందుకు సాగేందుకు ఉపయోగపడ్డాయి.


ప్రధాని పదవి చేపట్టినప్పుడు రోజువారీ ఖర్చులకు డబ్బల్లేని స్థితిలో దేశం 


పీవీ నర్సింహా రావు భారత తొమ్మిదవ ప్రధాని. హిందీయేతర బెల్ట్ నుండి రెండో ప్రధాని. దక్షిణాది నుండి తొలి ప్రధాని. రాజీవ్ గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోవడంతో పీవీ నర్సింహా రావు ఆమోదయోగ్యుడిగా కనిపించారు. అప్పటికి ఆయన దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నంద్యాల నుండి గంగుల ప్రతాప్ రెడ్డితో రాజీనామా చేయించి, లోకసభకు పంపించారు. తెలుగువాడు కావడంతో ఎన్టీఆర్ నాడు టీడీపీ తరఫున పోటీ పెట్టలేదు. నెహ్రూ-గాంధీయేతర కుటుంబం నుండి క్లిష్ట సమయంలో పూర్తికాలం పూర్తి చేసుకున్న మొదటి ప్రధాని పీవీ.  1990 చివరి నాటికి భారత ఆర్థికపరిస్థితులు దారుణంగా ఉన్నాయి.ద్రవ్యోల్భణం ఆకాశాన్ని అంటింది. చమురు ఖరీదుగా మారింది. దిగుమతికి తగినంత విదేశీ మారకద్రవ్యం లేదు. చేతిలోని విదేశీ మారకద్రవ్యపు నిల్వలు మూడు వారాలకే సరిపోతాయి. 1991 జనవరి నాటికి ప్రభుత్వం దివాళా తీసే పరిస్థితి. రుపాయి విలువ పడిపోయింది. అప్పులు పుట్టలేదు.

 


విమానంలో బంగారాన్ని పంపి తాకట్టు పెట్టి అప్పు 


పీవీకి ముందు  బంగారాన్ని తనఖా పెట్టి కొంత సొమ్ము తెచ్చి, అప్పులు తీర్చాల్సిన దుస్థితి.  67 టన్నుల బంగారాన్ని విమానాంలో ఇంగ్లాండ్‌కు పంపి  ఐఎంఎఫ్ వద్ద కుదువపెట్టి 2.2 బిలియన్ డాలర్ల రుణం తెచ్చారు. ద్రవ్యలోటు 12.7 చారిత్రక గరిష్టానికి చేరుకుంది. ప్రభుత్వ రుణం జీడీపీలో 53 శాతానికి చేరుకుంది. అప్పటి నుంచి సంస్కరణలు అమలు చేశారు.  దేశాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించేందుకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు అవకాశం కల్పించారు. చెల్లింపుల సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు రూపాయి విలువ తగ్గించారు. దీనిని రెండు విడతలుగా తగ్గించారు. 1991 జూలై 1 9 పైసలు, ఆ తర్వాత రెండు రోజులకు మరో 11 పైసలు తగ్గించారు. ఆయన సంస్కరణల వల్ల దీంతో ద్రవ్యోల్భణం తగ్గి, ఎగుమతులు పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణను ప్రతిపాదించారు. పన్ను సంస్కరణలు తెచ్చారు. ఇవి ఆదాయం పెరిగి, ఖర్చులు తగ్గేందుకు దోహదపడ్డాయి. మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ఆర్థికమంత్రిగా నియమించారు.


తర్వాత మారిన దేశ ఆర్థిక స్థితిగతులు 


వడ్డీ రేట్లకు సంబంధించి బ్యాంకులకు స్వేచ్ఛ ఇచ్చారు. ప్రయివేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించి పోటీతత్వాన్ని నింపారు. సెబికి 1992లో చట్టబద్దత కల్పించారు. 1991లో నూతన పారిశ్రామిక విధానం తెచ్చారు. ఎనిమిది రంగాలు మినహా మిగతా అన్ని రంగాల్లో ప్రయివేటు అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించారు. విదేశీ పెట్టుబడులకు అనుమతి, కొన్నింట 100 శాతం వరకు అనుమతించారు. పీవీ సంస్కరణలతో కరెంట్ ఖాతా లోటు తగ్గుముఖం పట్టింది. ద్రవ్యోల్భణం అదుపులోకి వచ్చింది. ప్రయివేటు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు పెరిగింది. పీవీ నరసింహా రావు సంస్కరణలు, ఆ తర్వాత నరేంద్ర మోడీ వరకు వచ్చిన ప్రభుత్వాల దూరదృష్టి కారణంగా 1991లో ఈ మూడు దశాబ్దాల్లో విదేశీ మారకపు నిల్వలు 500 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. లైసెన్స్ రాజ్‌కు చెల్లుచీటీ పాడారు.


పీవీ అమలు చేసిన  సంస్కరణలే నేడు.. దేశానికి వెన్నుముకగా నిలిచాయి. అందుకే ఆయనకు  భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వచ్చింది. చివరికి కేంద్రం ఆ డిమాండ్ ను నెరవేర్చింది.