BRS Mlas Went To Assembly in Autos: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో తరలివెళ్లారు. ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు.. హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ఆసెంబ్లీకి వచ్చారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా.. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, వారికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ అన్నారు. 'రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. 2 నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్వాగతిస్తున్నాం. అయితే, ఆటో కార్మికులను సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలి.' అని హరీష్ రావు డిమాండ్ చేశారు.






అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత






మరోవైపు, సభలోకి ఫ్లకార్డులు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. తమను పార్కింగ్ వరకూ అనుమతించాలని నేతలు డిమాండ్ చేయగా.. పోలీసులు నిరాకరించారు. అటు, శాసన మండలికి నల్ల కండువాలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను తొలుత భద్రతా సిబ్బంది అనుమతించలేదు. కాసేపు వాగ్వాదం అనంతరం వారిని లోనికి అనుమతించారు.






ఎమ్మెల్యే Vs పోలీసులు









బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించక పోవడంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన.. సైఫాబాద్ ఏసీపీ సంజయ్ ను దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కారు అద్దంపై కర్రతో దాడి చేశారు. ఈ క్రమంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.


Also Read: Patnam Mahender Reddy: కాంగ్రెస్‌ గూటికి పట్న మహేందర్‌రెడ్డి దంపతులు, చేవెళ్ల ఎంపీ టిక్కెట్‌ హామీ