ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఓ వినతి చేశారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ను తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో కూడా అన్ని సదుపాయాలు మెరుగుపడ్డాయని మల్లారెడ్డి అన్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక మోడల్‌గా తయారు చేశారని అన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఓడిపోతారని జనాలు అస్సలు అనుకోలేదని మాట్లాడారు. లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతతో.. ఓటు వెయ్యకూడదని ప్రజలు అనుకున్నారని.. అంతేకానీ, కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఓడిపోతారని జనాలు అనుకోలేదని అన్నారు. దీనికి ప్రజలంతా ప్రస్తుతం బాధ పడుతున్నారని అన్నారు. 


అందుకే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని కోరుతున్నానని మల్లారెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేటీఆర్‌ను కలిసి కేసీఆర్‌ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంకా రెండుమూడు రోజులు తర్వాత కేసీఆర్‌ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు.