Kodandaram Rajyasabha : తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని సమాచారం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల ( Rajyasabha members ) పదవీకాలం పూర్తవుతుంది. పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న వారిలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం శాసన సభలో ( Telangana Assembly ) ఉన్న సభ్యుల సంఖ్యాబలం దృష్ట్యా ఇందులో రెండు స్థానాలు కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది. వాటిలో ఒకటి ప్రొఫెసర్ కోదండరాం కు కేటాయిస్తారని తెలుస్తోంది.
ఎన్నికలకు ముందు కరీంనగర్ లో ప్రొఫెసర్ కోదండరాం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ( Rahul Gandhi ) భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పొత్తులో భాగంగా నాలుగు అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన అధినాయకత్వం ప్రస్తుతానికి ఇవ్వలేమని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ లో ఖాళీ అయ్యే పోస్టుల్లో ఒకటి కోదండరాం కు కేటాయిస్తారు. మరో పోస్టు కోసం భారీగానే పోటీ ఉందని తెలుస్తోంది. ఆ ఒక్క స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి తనకు కేటాయించాలని కోరుతున్నారు. ఇటీవల ఓడిపోయిన సీనియర్లు కొంత మంది తమను గుర్తించాలని కోరుతున్నారు.
2023 తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణలో నర్సంపేట, సూర్యపేట, జహీరాబాద్, ఎల్లారెడ్డి, ముథోళ్, కోరుట్ల, గద్వాల సీట్లలో తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు తెలంగాణ జన సమితి సిద్ధమయింది. కాంగ్రెస్ తో పొత్తు సందర్భంగాను ఈ సీట్లలో పోటీ చేస్తామని ఆ పార్టీ పెద్దల ముందు ప్రతిపాదించింది. అయితే సర్వేల్లో తెలంగాణ జన సమితి అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేవని తేలడంతో కాంగ్రెస్ అధినాయకత్వం కోదండరాంను రాజ్యసభకు పంపుతామని, ఈ ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థులను పోటీకి నిలపకుండా తమకు మద్ధతు ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం కోరినట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికల్లో కోదండరాం పోటీ చేస్తానంటే మంచిర్యాల, హన్మకొండ, జనగాం స్థానాల్లో ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే తానొక్కడినే పోటీ చేస్తే అది పార్టీలో చెడు సంకేతానికి దారి తీస్తుందని, ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు మద్ధతుగా ప్రచారం చేస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకే సీట్ల గురించి ఆలోచించకుండా మద్దతు తెలిపారు.
టీజేఎస్ కు ఒక రాజ్య సభ, రెండు ఎమ్మెల్సీలు, ఐదు కార్పోరేషన్ పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం హామీ ఇచ్ిచందని అంటున్నారు. పదవులన్నింటిపై రాష్ట్ర నాయకత్వంతో కాకుండా కాంగ్రెస్ అధినాయకత్వంతోనే చర్చలు జరిగినట్లు టీజేఎస్ నేతలు చెబుతున్నారు. ముందు ముందు టీజేఏసీ నాయకులకూ పదవులు లభించే అవకాశం ఉంది.