Bobby Deol Jamal Kudu Song: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేషన్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ రణబీర్ తండ్రిగా కనిపించగా, మరో దిగ్గజ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా వసూళ్లు వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 500 కోట్ల మార్కును దాటింది. రణబీర్ నటన, సందీప్ రెడ్డి టేకింగ్ చూసి సినీ లవర్స్ ఆశ్చర్యపోయారు.
సంగీత ప్రియులను అలరించిన ‘జమల్ కుడు’ సాంగ్
ఈ చిత్రంలో బాబీ పాత్ర చిన్నదే అయినా, ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సుమారుగా 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయనకు ఈ సినిమాతో కనీవినీ ఎరుగని గుర్తింపు లభించింది. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన క్రేజ్ ఒక లెక్క అయితే, ఈ సినిమాలోని పాత్రకు దక్కిన ప్రశంసలు మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. అబ్రార్ పాత్రలో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు బాబీ. ఆయన ఎంట్రీ సమయంలో వచ్చే పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ‘జమల్ కుడు’ అంటూ సాగే ఈ పాట ఆడియెన్స్ ను ఓ రేంజిలో అలరిస్తుంది.
‘జమల్ కుడు’ సాంగ్ ఏ దేశంలో పుట్టిందో తెలుసా?
ఇక రీసెంట్ గా ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే 28 మిలియన్లకు పైగా వ్యూస్ తో మార్మోగిపోతోంది. యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్స్ లో టాప్ లో నిలిచింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ పాట నిజానికి ఇండియాకు చెందినది కాదు. ఇదో ఇరానియన్ సాంగ్. ప్రముఖ ఇరానియన్ కవి బిజాన్ సమాందర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ పాట ఇరాన్ లో జరిగే పెళ్లి వేడుకలలో పెట్టడం విశేషం.
పెళ్లిళ్లలోనే కాదు, ఇతర వేడుకలలోనూ ఈ పాటను ప్లే చేస్తుంటారు. ఈ పాటను 1977లో అనౌశిర్వాన్ రోహాని అనే సంగీత దర్శకుడు రీమిక్స్ చేశాడు. లేటెస్టుగా ‘యానిమల్’ మూవీలో దర్శకడు సందీప్ ఈ రీమిక్స్ పాటనే వాడుకున్నాడు. ఈ మూవీ సంగీత దర్శకుడు హర్షవర్ధన్, మేఘన నాయుడు, ఐశ్వర్య దాసరి, అభిక్య, సబీహతో పాటు కొందరు చిన్నారులతో ఈ పాటను పాడించారు. జానపద, సంప్రదాయాల కలబోతగా ఉన్న ఈ పాట దేశ వ్యాప్తంగా సంగీత ప్రియులను అలరిస్తోంది.
ఇక ఈ పాట మీద సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు. “నేను గతంలో వెళ్లిన చాలా ఇరానియన్ పెళ్లిళ్లలో ఈ పాటను పెట్టారు. నా చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి” అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. భారత్ లాంటి సాంస్కృతిక వైభవం కలిగిన దేశంలో ఈ పాట హిట్ కావడం సంతోషంగా ఉందని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ పాట బాబి డియోల్ కు అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిందని ఇంకొకరు వెల్లడించారు.
Read Also: బాబాయ్ హోటల్‌లో వెంకీ మామ సందడి - శ్రద్ధా శ్రీనాథ్‌తో కలిసి ఇంద్రకీలాద్రిపై వెంకటేష్ ప్రత్యేక పూజలు