Elephants Terrorizing In Chittoor District: చిత్తూరు జిల్లాలో ఏనుగులు గుంపు స్ధైర విహారం చేస్తోంది. గత నెల రోజుల నుంచి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ పంటలు నాశనం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఫారెస్టు ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. రైతులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. లక్షల్లో పంటలు ధ్వంసం చేస్తున్నా ఏనుగుల గుంపును తరిమే ప్రక్రియ చేపట్టలేదంటున్నారు. దీంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.


వికోట మండలంలో 13 ఏనుగుల గుంపు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం పంటలను ధ్వంసం చేశాయి. కృష్ణాపురం, మోట్లపల్లి, జవునిపల్లి, మిట్టూరు తదితర గ్రామాల సమీప పంటపొలాల్లోకి ప్రవేశించి నాశనం చేస్తున్నాయి. కూరగాయల పంటలను ధ్వంసం చేస్తున్నారు. తొక్కి పడేస్తున్నాయి.


ఏనుగుల బారి నుంచి తమ పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. మరోవైపు కుప్పం వైపుగా ఏనుగుల గుంపు బయల్దేరింది. 70 ఏనుగుల గుంపు అటుగా వస్తోందని సమాచారం తెలుసుకున్న కుప్పం ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. రాత్రి కర్ణాటక సరిహద్దులో ఈ గుంపు హల్ చల్ చేసింది. అటు కర్ణాటక పోలీసులు కూడా హై అలర్ట్ అయ్యారు. 


కోలార్ ఎస్పీ ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గ్రామ సరిహద్దుల్లోని పొలాల్లో రాత్రి పూట ప్రజలు ఉండని అధికారులు సూచిస్తున్నారు. రాత్రిపూట బయటకు రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ఏనుగుల గుంపు వస్తుందని తెలుసుకున్న కుప్పం అటవీ శాఖ అధికారులు అనిమల్ ట్రాకర్స్‌తో గస్తీ కాస్తున్నారు.