చాలా ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌ మళ్లీ మెరిసింది. వన్డే ప్రపంచకప్‌నకు కూడా దూరమై అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన కరేబియన్‌ జట్టు మళ్లీ వెలుగులోకి వచ్చింది. సొంత గ‌డ్డపై 25 ఏళ్ల త‌రువాత ఇంగ్లాండ్‌పై వ‌న్డే సిరీస్‌ను నెగ్గి చరిత్ర సృష్టించింది. బార్బడోస్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ విజయం సాధించింది. కరేబియన్‌ దీవుల్లో బ్రిటీష్‌ జట్టుపై విండీస్‌ వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. విండీస్‌ చివరగా సొంతగడ్డపై 1998లో ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ విజయం సాధించింది. నిర్ణయాత్మక‌మైన మూడో వ‌న్డేకు వ‌రుణుడు ప‌లుమార్లు అంత‌రాయం కలిగించాడు. ఈ మ్యాచులో వెస్టిండీస్ జ‌ట్టు డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్దతిలో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. త‌ద్వారా మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1తో కైవ‌సం చేసుకుంది. 



 వర్షం కారణంగా మూడో వన్డేను 40 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బెన్‌ డకెట్‌(71) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లియామ్ లివింగ్ స్టోన్ (45) రాణించాడు. ఫిలిప్ సాల్ట్ (4), విల్ జాక్స్ (17), జాక్ క్రాలే(0), హ్యారీ బ్రూక్(1), జోస్ బట్లర్ (0)లు విఫ‌లం అయ్యారు. విండీస్‌ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే, జోషఫ్‌య తలా 3 వికెట్లు పడగొట్టగా.. షెపెర్డ్‌ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం విండీస్‌ టార్గెట్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం 188గా నిర్ణయించారు. 188 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 31.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెస్టిండీస్‌ బ్యాట‌ర్లలో కార్టీ 58 బంతుల్లో 50 పరుగులు చేయగా... ఆథనాజ్‌ 51 బంతుల్లో 45 పరుగులు చేశాడు. రొమారియో షెపర్డ్ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 28 బంతుల్లో 41పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరు ముగ్గురు రాణించడంతో విండీస్‌ చారిత్రక విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బౌల‌ర్లలో విల్ జాక్స్ మూడు వికెట్లు తీయ‌గా, గుస్ అట్కిన్సన్ రెండు, రెహాన్ అహ్మద్ ఓ వికెట్ సాధించాడు. విండీస్ కెప్టెన్ షై హోప్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ల‌భించింది. 


 ఒకప్పుడు దిగ్గజ జట్లకు ముచ్చెమటలు పట్టించిన విండీస్‌ జట్టు.. ఇప్పుడు అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, జింబాబ్వే వంటి జట్ల చేతుల్లోనూ పరాజయం పాలై వన్డే ప్రపంచకప్‌ నుంచి కూడా నిష్క్రమించింది. క్రమక్రమంగా కరేబియన్‌ జట్టు ప్రభ మసక బారి ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. ఒకప్పుడు క్రికెట్‌ అంటే విండీస్‌ జట్టే అన్నంతగా వెలిగిపోయిన కరేబియన్‌ జట్టు... ఇప్పుడు ప్రపంచకప్‌నకు కూడా అర్హత కూడా సాధించలేక చతికిలపడింది. 1975లో వన్డే ప్రపంచకప్‌ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా వెస్టిండీస్‌ జట్టు లేకుండా ఈసారి ప్రపంచకప్‌ జరుగుతోంది. తొలి రెండు ప్రపంచకప్‌లను సునాయసంగా గెలుచుకున్న ఈ జట్టు... 48ఏళ్ల వరల్డ్‌ కప్‌ చరిత్రలో తొలిసారి అర్హత సాధించలేక పోయింది. ఇది వెస్టిండీస్‌ జట్టుకే కాదు... క్రికెట్‌ను అమితంగా ప్రేమించిన నాటి తరం క్రికెట్‌ ప్రేమికులకు కూడా తీరని బాధను మిగిల్చేదే.1980వ దశకం వరకు విండీస్‌ ప్రయాణం అప్రతిహాతంగా సాగింది. కరేబియన్‌ జట్టు బరిలోకి దిగుతుందంటేనే ప్రత్యర్థి జట్లు మానసికంగా ఓటమికి సిద్ధమైపోయేవి. కానీ విండీస్‌ పతనం ప్రారంభాన్ని భారత్‌ మొదలుపెట్టింది. హ్యాట్రిక్‌ ప్రపంచకప్‌ విజయాలు సాధించాలని గట్టి పట్టుదలగా ఉన్న క్లైవ్‌ లాయిడ్‌ బృందాన్ని... కపిల్‌దేవ్‌ సేన కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇక ఆ తర్వాత వెస్టిండీస్‌ జట్టు ఏ ప్రపంచకప్‌లోనూ ఫైనల్‌కు కూడా చేరుకోలేక పోయింది. 1990వ దశకం వరకూ బలంగానే కనిపించిన విండీస్‌... తర్వాత పూర్తిగా పతనం కావడం ప్రారంభించింది.