Former JD of CBI Lakshmi Narayana: విజయవాడ: మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనుండగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో తన పార్టీ పేరును శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఇది సాధారణంగా పెట్టిన పార్టీ కాదు... ప్రజల్లోంచి పుట్టిన పార్టీ అన్నారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా తేవడం కోసమే తమ పార్టీ పుట్టిందన్నారు. ఎవరూ అవినీతి చెయ్యలేని విధంగా చూడడానికి పుట్టిన పార్టీ జై భారత్ పార్టీ అని పేర్కొన్నారు. ఒకరు అభివృద్ధి పేరుతో ఒక నగరం కట్టడాన్ని లక్ష్యంగా ఒకరు పని చేశారు... అవసరాల పేరుతో అభివృద్ధి ని పక్కన పెట్టింది మరొకరు.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చెయ్యడానికి తాను పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జై భారత్ పార్టీ జెండా రంగులు..
జై భారత్ నేషనల్ పార్టీ జెండాను మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. పార్టీ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. లక్ష్మీ నారాయణ పిడికిలి బిగించినట్లుగా ఉన్న ఫొటో సైతం జై భారత్ నేషనల్ పార్టీ జెండాలో ముద్రించి ఉండటం మీరు గమనించవచ్చు.
ప్రత్యేక హోదా అడిగే ధైర్యం వాళ్లకు లేదు..
ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమతాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకు రావడానికి తన పార్టీ నాంది పలుకుతుందన్నారు. దేశంలో రాజకీయ పార్టీల పరిస్థితి అయోమయంగా ఉందని, రాజకీయాలంటే ప్రజల్ని మోసం చేయడమే అనే అభిప్రాయం అందరిలోకి వెళ్ళిపోయిందన్నారు. రాజకీయాలు అంటే సుపరిపాలన అని చెప్పడమే జై భారత్ నేషనల్ పార్టీ సిద్ధాంతమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా విషయమై ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగానికి అసలు కారణం ప్రత్యేక హోదా రాకపోవడమే అని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై ప్రశ్నించడానికి 3 సార్లు అవకాశం వచ్చినా, అయినా అడిగే ధైర్యం రాష్ట్రం లో ఎవరికీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో యువత అధికంగా ఉన్నారని, ఏపీలోని యువతకు ఉద్యోగాలు రాకపోవడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణమని ఆరోపించారు. రాజకీయాల గురించి చులకనగా మాట్లాడే పరిస్థితి ఉందన్నారు. ఏపీ ప్రజలు ఎవరికీ బానిసలు కాదని, మన హక్కుల్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ప్రజల్లోంచి పుట్టుకొచ్చింది తమ పార్టీ అన్నారు.
లక్ష్మీ నారాయణ పొలిటికల్ కెరీర్..
సీబీఐలో జాయింట్ డైరెక్టర్ స్థాయికి వెళ్లి లక్ష్మీ నారాయణ సేవలు అందించారు. ఆపై ఐపీఎస్ కు రాజీనామా చేసిన ఆయన పాలిటిక్స్ లోకి వచ్చారు. 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీచేసి ఓడిపోయిన తర్వాత అక్కడే కొంత కాలం పని చేసుకున్నారు. కానీ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణంగా జనసేనకు రాజీనామా చేశారు. కొంతకాలం రైతు, ప్రజా సమస్యలు, యువత ఓటింగ్ పై అవగాహన కల్పించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పిన లక్ష్మీనారాయణ.. తాజాగా జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.