Forced Religious Conversion: బలవంతపు మత మార్పిడి "తీవ్రమైన అంశం" అని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీం కోర్టు సోమవారం పునరుద్ఘాటించింది. మతమార్పిడి నిరోధక చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం సేకరించిన తర్వాత వివరణాత్మక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది.
అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. డబ్బు ఆశ చూపించి, గిఫ్ట్‌లు ఇస్తామని, బెదిరించి మత మార్పిడి చేయించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
కేంద్రం స్పందన
రాష్ట్రాల నుంచి మత మార్పిడికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని కేంద్రం.. కోర్టుకు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవి కుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ అంశంపై వివరణాత్మక సమాచారాన్ని అందించడానికి మరింత సమయం కావాలని కోరారు. తాము రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, ఒక వారం సమయం ఇవ్వాలని మెహతా కోరారు.
చట్టం
బలవంతపు మత మార్పిడిని అరికట్టేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. చట్ట వ్యతిరేక మత మార్పిడిని కట్టడి చేసేందుకు యాంటీ కన్వర్షన్ బిల్‌ను (anti-conversion bill) అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఇకపై ఈ రాష్ట్రంలో ఎవరు చట్ట వ్యతిరేకంగా మతం మార్చాలని చూసినా...అది నేరంగా పరిగణిస్తారు. నాన్ బెయిలబుల్ నేరంగా చూడడంతో పాటు...కనీసం 3-10 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు. ఇదే విషయాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. Uttarakhand Freedom of Religion (Amendment) Act 2022 కింద బలవంతంగా మత మార్పిడికి పాల్పడిన వారికి జైలు శిక్షతోపాటు రూ.50,000 జరిమానా విధించనున్నారు. అంతే కాదు.. బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డ వ్యక్తులు.. బాధితులకు పరిహారం కూడా చెల్లించక తప్పదు. రూ.5 లక్షల వరకూ ముట్టు చెప్పాల్సిందే.
ఇలా బలవంత మత మార్పిడికి పాల్పడిన వారికి గతంలో గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించే వాళ్లు. కానీ...ఈ సారి ఆ గడువుని పెంచారు. "ఎవరైనా సరే. ఓ మతం నుంచి మరో మతంలోకి మార్చేందుకు ప్రయత్నించవద్దు. బెదిరించో, బలవంతం చేసో, ఇంకేదో ఆశ చూపించో ఇలాంటివి చేయడం నేరం. చట్ట ప్రకారం ఇది కుట్ర కిందకే వస్తుంది" అని యాక్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని 25,26,27,28 ఆర్టికల్స్ మత స్వేచ్ఛను తెలియజేస్తున్నాయి. ప్రతి మతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది" అని ప్రభుత్వం చెబుతోంది.
Also Read: All Party Meeting: మోదీతో ప్రత్యేక భేటీ ఏం లేదు: సీఎం మమతా బెనర్జీ