ఐదేళ్ల క్రితం నవంబర్ 8వ తేదీని దేశంలో వంద కోట్ల మంది జనం మర్చిపోలేరు. ఒక వేళ తేదీని మర్చిపోయినప్పటికీ ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో తాము పడిన వేదన, ఆవేదన, పరిస్థితులను ఎప్పటికీ మర్చిపోరు. ఆ నిర్ణయం డిమానిటైజేషన్. పెద్ద నోట్ల రద్దు. బ్లాక్ మనీని అరికట్టడానికి అని.. నగదు చెలామణి తగ్గించడానికి అని ప్రభుత్వం చెప్పింది. దీర్ఘ కాలంలో ఫలితాలు ఉంటాయని చెప్పింది. ఇప్పటికి ఐదేళ్లయింది. మరి డిమానిటైజేషన్ ఫలితాలు కనిపిస్తున్నాయా ? ప్రజలకు ఆ ఫలాలను అనుభవిస్తున్నారా ?
బ్లాక్‌మనీ అంతానికే నోట్ల రద్దు అని మొదట్లో ప్రకటన ! మరి లక్ష్యం నెర వేరిందా ?
పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు రూ. వెయ్యి, రూ. ఐదు వందల నోట్ల రూపంలో ఉన్న నల్లధనాన్ని పెద్దలు దాచుకున్నారని... వాటన్నింటినీ వెలికి తీస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద నోట్లు రద్దు చేసినందున ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో జమ చేస్తారు. అప్పుడు బ్లాక్ మనీ లెక్కలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావించింది. ఆ సమయంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణలో రూ. మూడు లక్షల కోట్ల వరకూ బ్లాక్ మనీ ఉంటుందని అవి బ్యాంకులకు తిరిగి రావని చెప్పింది. రూ. 15 లక్షల కోట్ల పెద్ద నోట్లు ఉంటే.. రూ. 12 లక్షల కోట్లు మాత్రమే వస్తాయని లెక్కలు చెప్పింది. కానీ ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన వివరాల ప్రకారం నోట్లు రద్దు చేసిన రోజు దేశంలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.15 లక్షల 41వేల కోట్లు. బ్యాంకులకు తిరిగి వచ్చిందిరూ. 15 లక్షల 31వేల కోట్లు. అంటే..99.3 శాతం తిరిగి వచ్చాయి.
Also Read : ప్రపంచంలో ఎక్కువగా ఆరాధించే నాయకుల్లో ముందు వరుసలో మోడీ.. ఆ తర్వాతి స్థానాల్లో..
బ్లాక్ మనీ లేదా అఫీషియల్‌గా బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నారా ?
దేశంలో డబ్బంతా బ్యాంకులకు చేరింది. కానీ నల్లధనం ఎంత అనేదనిపై స్పష్టత లేదు. బ్యాంకుల్లో డిపాజిట్ అయినంత మాత్రాన అంతా న్యాయబద్ధమైన డబ్బులు కాదని అందులోనే నల్లధనం ఉంది.. పట్టుకుంటామని కేంద్రం ప్రకటించింది. కానీ ఐదేళ్లు గడిచినా ఆ నల్లధనం ఎంత అనేదానిపై స్పష్టత లేదు. ఎంత నల్లధనాన్ని పట్టుకున్నారు..?. ఎవర్ని పట్టుకున్నారు..? ఫలానా వాళ్లు బ్లాక్‌మనీ డిపాజిట్ చేశారని గుర్తించారా..? అన్న అంశాలపై స్పష్టత లేదు. దేశంలో బ్లాక్ మనీ లేదని ఎవరూ నమ్మరు .. ఎందుకంటే ఇప్పటికీ లెక్కలు లేకుండా లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. రాజకీయ పార్టీలకు లెక్కలు లేకుండా కోట్ల విరాళాలు ఇస్తున్నారు. అంటే బ్లాక్ మనీని అధికారికంగా వైట్ చేసుకున్నారు. వారిని ప్రభుత్వం పట్టుకోలేకపోయింది.
డిజిటల్ లావాదేవీలే కాదు నగదు చెలామణి కూడా పెరిగింది !
నోట్ల రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా నగదు చెలామణి ఉండటం వల్ల నల్లధనం పెరిగిందని అందుకే నగదు చెలామణిని తగ్గించడానికి నోట్ల రద్దు చేశామని తెలిపింది. నిజానికి ప్రజల నగదు చెలామణి ఐదేళ్లలో ఏ మాత్రం తగ్గలేదు సరి కదా.. యాభై శాతం పెరిగింది. నవంబర్ 4, 2016న రూ.17.97 లక్షల కోట్లుగా ఉన్న ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, అక్టోబర్ 8, 2021 నాటికి రూ. 28.30 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన చూస్తే ఈ పెంపు ఏకంగా 57.48 శాతం ఉంది. అంటే.. నోట్ల రద్దు ముందు కన్నా ఎప్పుడే ఎక్కువ నోట్లు చెలామణిలో ఉన్నాయి. నగదు చెలామణి తగ్గిస్తామని నోట్లు రద్దు చేస్తే ఆది కాస్తా.. ఇవాళ ఎక్కవయింది.
అసలు నోట్ల రద్దు లక్ష్యం ఏమిటి? ఆ ఫలితాలు ఎలా వస్తున్నాయో కేంద్రం క్లారిటీ ఇస్తుందా ?
నోట్ల రద్దు నిర్ణయం ఆషామాషీగా తీసుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఆషామాషీగా తీసుకున్నా.. మేధోమథనం నిర్వహించి తీసుకున్నా అది దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు లక్ష్యాలను.. అవి ఇస్తున్న ఫలాలను ప్రజలకు తెలియచేయాల్సి ఉంది. అయితే కేంద్రం ఆ నిర్ణయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితులు ఉన్నాయి. పరోక్షంగా తమ నిర్ణయం వల్ల జరిగిన మేళ్లు అంటూ ఆర్థిక మంత్రి వంటి వాళ్లు గంగిరెద్దులు ఆడించుకునేవాళ్లు కూడా డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారని సింబాలిక్‌గా చెబుతున్నారు. కానీ అసలు ఆ నిర్ణయం ప్రభావాలపై స్పష్టమైన నివేదిక మాత్రం ఇంత వరకూ వెల్లడించలేదు.
Also Read: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తు నుంచి తొలగించడంపై సమీర్ వాంఖడే ఏమన్నారంటే..!
కష్టాలను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు !
అప్పటికప్పుడు తమ జేబుల్లో ఉన్న నోట్లు చెల్లవని తెలిస్తే ప్రజలకు ఏమవుతుంది..? బ్యాంకుల్లో ఉన్న డబ్బు ఇవ్వరని తెలిస్తే ఏం జరుగుతుంది..? బ్యాంకులో డబ్బులున్నా టీ, టిఫిన్ చేయడానికి చేతుల్లో చిల్లర లేక కడుపు కాలితే ఎలా ఉంటుంది ? ఆస్పత్రుల్లో బిల్లులు కట్టలేక ఇబ్బందిపడిన వారు.. పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలను వాయిదా వేసుకున్న వారు... ఏటీఎంల వద్ద పడిగాపులు పడిన వారు.. తమ తమ బాధలను ప్రతీ ఏడాది నోట్ల రద్దు రోజున గుర్తు చేసుకుటూనే ఉన్నారు. నోట్ల రద్దు ఫలాలేమో కానీ ఈ కష్టాలు మాత్రం ప్రతీ సారి హైలెట్ అవుతూనే ఉన్నాయి. కొసమెరుపేమిటంటే ఐదేళ్ల కిందట డిమానిటైజేషన్ చేపట్టిన కేంద్రం ఇప్పుడు మానిటైజేషన్ కూడా ప్రారంభించింది. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలను లీజుకొచ్చి ఆదాయం పొందడం.
Also Read: ఛత్తీస్‌ఘడ్‌లో ఆగని కాల్పుల మోత... మరో ముగ్గురు నక్సల్స్ మృతి