మహారాష్ట్రలో సంచలనంగా మారిన ముంబయి డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ సీనియర్ అధికారి సమీర్ వాంఖడేను దర్యాప్తు నుంచి తొలగిస్తున్నట్లు ఎన్‌సీబీ ప్రకటించిందని కథనాలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో వాంఖడే పెద్ద ఎత్తున లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను దర్యాప్తు టీమ్ నుంచి తొలగించినట్లు ప్రచారం జరిగింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, డ్రగ్స్ కేసులో సాక్షిగా పేర్కొంటోన్న ప్రభాకర్ సాలీ కూడా వాంఖడేపై ఆరోపణలు చేశాడు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో విచారణ బాధ్యతల నుంచి సమీర్ వాంఖడేను తప్పిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై నేరుగా అధికారి సమీర్ వాంఖడే స్పందించారు. తనను ముంబై డ్రగ్స్ కేసుతో పాటు ఇతర కేసుల విచారణ బాధ్యతల నుంచి తనను ఎవరూ తప్పించలేదని తెలిపారు. కొన్ని కేసుల దర్యాప్తును ఇతర సంస్థలకు, అధికారులకు బదలాయించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించడంతో అనుమానాలు రేకెత్తాయని ఆయన పేర్కొన్నారు.
Also Read: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు నుంచి వాంఖడే ఔట్
తనపై ఆరోపణలు వస్తున్నందున ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని సమీర్ వాంఖడే స్పష్ట చేశారు. తన పిటిషన్‌కు స్పందనగా ముంబై డ్రగ్స్ కేసును ఎన్సీబీ ఢిల్లీ విభాగానికి చెందిన సిట్ దర్యాప్తు చేస్తుందని సమీర్ వాంఖడే వెల్లడించారు. వాంఖడే దర్యాప్తు చేస్తున్న 6 డ్రగ్స్ కేసులను ఇకనుంచి అధికారి సంజయ్ సింగ్ దర్యాప్తు చేయనున్నారు. కేసును ఒకరి నుంచి మరో అధికారికిగానీ, సంస్థకు బదలాయించడం మాత్రమే.. కేసు దర్యాప్తు నుంచి తొలగించారని ప్రచారం జరిగిందన్నారు.
‘ముంబై డ్రగ్స్ కేసు విచారణను ఎన్సీబీ ఢిల్లీ విభాగానికి చెందిన సిట్ కు బదిలీ చేశాం. సమీర్ వాంఖడే వాంగ్మూలాన్ని మేం రికార్డు చేసుకున్నాం. ఇది చాలా కీలకమైన దర్యాప్తు, కనుక ఇప్పుడే అన్ని విషయాలను బహిర్గతం చేయలేం. దర్యాప్తు ముమ్మరం చేశాం. సాక్షులను ఒక్కొక్కరిగా పిలిచి వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నామని’ ఎన్‌సీబీ డీడీజీ జ్ఞానేశ్వర్ సింగ్ పేర్కొన్నారు.
ముంబై క్రూయీజ్ షిప్ డ్రగ్స్ కేసు..
పక్కా సమాచారంతో ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో అక్టోబర్ 3న జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. దాంతో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సమీర్ వాంఖడే నేతృత్వంలో ఓడలో అర్ధరాత్రి దాడులు జరిపారు. మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారని గుర్తించిన ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేపట్టి కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ షిప్‌లోనే ఉన్న షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా పలువుర్ని అధికారులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. దాదాపు మూడు వారాలు జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రావడంతో ఇటీవల విడుదలయ్యాడు.