Imran Khan:
అరెస్ట్ ఎందుకు..?
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్‌సాఫ్ (PTI) చీఫ్..ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన ఓ పబ్లిక్ ర్యాలీలో ప్రభుత్వ సంస్థలకు, పోలీసులకు, చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పటి నుంచి ఆయనను టార్గెట్ చేసింది ప్రభుత్వం. యాంటీ టెర్రర్ యాక్ట్ కింద ఆయనను అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పీటీఐ పార్టీ నేతలు ఈ నిర్ణయంపై తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఒకవేళ ఇమ్రాన్‌ను అరెస్ట్ చేస్తే..రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టాలని ఆ నేతలు భావిస్తున్నట్టు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన సభలో ఇమ్రాన్ ఖాన్...ఓ మహిళా మెజిస్ట్రేట్ సహా...పోలీసులు, ఎన్నికల సంఘం, రాజతీయ ప్రత్యర్థులపై కేసులు పెడతానంటూ హెచ్చరికలు చేశారు. దీనిపై ఓ మెజిస్ట్రేట్ ఆయనపై కేసు నమోదు చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రస్తుతానికి ఆయన ప్రసంగాలపై నిషేధం విధించారు. ఒకటికి రెండు సార్లు ఎడిట్ చేయకుండా ఇమ్రాన్ ప్రసంగాలను టెలికాస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేస్తారంటూ వార్తలు రావటంపై ఆ పార్టీ అప్రమత్తమైంది. పీటీఐ సీనియర్ నేత ఫవాద్ చౌదరి పార్టీ నేతలతో మాట్లాడారు. ఇమ్రాన్ నివాసమైన బని గలా రెసిడెన్సీకి కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు...పార్టీ నేతలు ఇమ్రాన్ ఇంటికి వరుస కట్టారు. అవాంఛిత సంఘటనలేమీ జరగకుండా పోలీసులు నిఘా ఉంచారు.
ఎన్నికలపైనా..
ఇమ్రాన్ ఖాన్‌ను హౌస్ అరెస్ట్ చేసే అవకాశముందనీ తెలుస్తోంది. హై కమాండ్ ఆదేశాలు అందగానే...ఆయనను అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇమ్రాన్..తన పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే...నెక్స్ట్ ఏం చేయాలో నేతలకు సూచనలు చేస్తున్నట్టు సమాచారం. అటు పోలీసులు...ఇమ్రాన్ ఇంటి పరిసరాల్లో పహారా కాస్తున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమి గూడకుండా చర్యలు చేపడుతున్నారు. కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. పాకిస్థాన్‌లో ఎన్నికల విషయంలోనూ గతంలో ఎన్నో సార్లు మాట్లాడారు...ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పాకిస్థాన్‌లో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి తెరపడాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు."ప్రస్తుతం అనిశ్చితి తొలగిపోవటానికి ఒకే ఒక మార్గముంది. నన్ను ప్రధాని పదవి నుంచి తొలగించే సమయానికి, ఎన్నికల ప్రకటన చేశాను. కానీ, సుప్రీం కోర్టు నా నిర్ణయాన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు ముందస్తుగా ఎన్నికలు నిర్వహించటమే సరైన నిర్ణయమని ఇప్పటికీ భావిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)కో ఫౌండర్ అసిఫ్ అలీ జర్దారీ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపినట్టు...పాకిస్థాన్ అవామీ ముస్లిం లీగ్ (AML)చీఫ్ షేక్ రషీద్ వెల్లడించారు. ఎన్నికల తేదీని కూడా ట్వీట్ చేశారు. కొత్త ఎన్నికల సంఘం నేతృత్వంలో ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: అమిత్‌షాకు చెప్పులు అందించిన బండి సంజయ్- వీడియో షేర్ చేస్తూ షేక్ చేస్తున్న ప్రత్యర్థులు
Also Read: Jailer Movie Poster : డ్యూటీ ఎక్కిన రజనీకాంత్ - ఖైదీలకు చుక్కలే