సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'జైలర్' (Jailer Movie). నయనతార ప్రధాన పాత్రలో 'కో కో కోకిల', శివ కార్తికేయన్ హీరోగా 'వరుణ్ డాక్టర్', తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'మాస్టర్' సినిమాలు తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రజనీకి 169వ సినిమా. ఈ రోజు సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను యూనిట్ షేర్ చేసింది.
సెట్స్ మీదకు 'జైలర్'
ఈ సినిమాలో రజనీకాంత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఆయన జైలర్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ రోజు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ''నేడు జైలర్ తన యాక్షన్ స్టార్ట్ చేశారు'' అని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. అంతే కాదు... సూపర్ స్టార్ కొత్త పోస్టర్ కూడా విడుదల చేసింది. జైలు అధికారిగా ఖైదీలకు చుక్కలు చూపించే పాత్రలో రజనీకాంత్ నటన కొత్తగా ఉండబోతుందని తమిళ సినిమా పరిశ్రమ టాక్. ఆయన అయితే జైలర్ డ్యూటీ ఎక్కేశారు.
హైదరాబాద్‌లోనే 'జైలర్'
ప్రస్తుతం రజనీకాంత్ హైదరాబాద్ సిటీలో ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ ప్రముఖ స్టూడియోలో సినిమా కోసం జైలు సెట్ వేశారు. అందులో షూటింగ్ జరుగుతోంది. కొన్ని రోజులు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని యూనిట్ వర్గాలు తెలిపాయి.
రజనీకి జోడీగా రమ్యకృష్ణ
'జైలర్' సినిమాలో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ కథానాయికగా నటించనున్నారు. గతంలో వీళ్లిద్దరి కలయికలో పలు హిట్ సినిమాలు వచ్చాయి. అందులో 'నరసింహ' ఎవర్ గ్రీన్ ఫిల్మ్. ఆ నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన రోల్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఇప్పటికీ రమ్యకృష్ణ బెస్ట్ రోల్స్ అంటే నీలాంబరి పాత్ర ముందు వరుసలో ఉంటుంది. చాలా సంవత్సరాల విరామం తర్వాత రజనీతో ఆవిడ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ కీలక పాత్రలో కనిపించనున్నారని తమిళ సినిమా పరిశ్రమ వర్గాల సమాచారం.
తమన్నా కూడా ఉన్నారా?
'జైలర్' సినిమాలో తమన్నా భాటియా కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే... ఇప్పటి వరకూ ఆ విషయాన్ని చిత్ర బృందం కన్ఫర్మ్ చేయలేదు. రజనీతో కూడా తమన్నా ఇంత వరకు నటించలేదు. ఒకవేళ ఈ సినిమా కన్ఫర్మ్ అయితే... రజనీ - తమన్నా కలయికలో ఇదే తొలి సినిమా అవుతుంది.
Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?
అనిరుధ్ సంగీతంలో...
'జైలర్' సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఇంతకు ముందు దర్శకత్వం వహించిన సినిమాలకూ ఆయనే సంగీతం అందించారు.