టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ట్వీట్ చేసినా ప్రపంచమంతా గమనిస్తుంది. అతని స్థాయి అలాంటిది మరి. రాకెట్ సైన్స్ చదువుకుని ఏకంగా స్పేసెక్స్‌ సంస్థనే స్థాపించిన మస్క్‌కి  ప్రయోగాలంటే ఎంతో సరదా. ఎప్పుడూ ఏదో ఓ ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేయాలని తపిస్తుంటాడు. అందుకోసం శ్రమిస్తూనే ఉంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ పైనా నిత్యం పరిశోధనలు చేస్తోంది టెస్లా. ఈ టెక్నాలజీతోనే హ్యూమనాయిడ్ రోబోట్‌ని తయారు చేయాలనేది ఎలన్ మస్క్ కల. ఇందుకోసం చాలానే సమయం కేటాయిస్తున్నారాయన. ఆప్టిమస్ అని పిలిచే హ్యూమనాయిడ్ రోబోట్‌ని ఈ ఏడాది ఆగస్టు 19న వెలుగులోకి తీసుకొస్తామని గతంలోనే చెప్పారు మస్క్. 2021 ఆగస్టులో ఏఐ డే సందర్భంగా ఆప్టిమస్ గురించి ప్రస్తావించారు మస్క్. వచ్చే ఏఐ డే నాటికి ప్రోటోటైప్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని అప్పట్లోనే ప్రకటించారు. ఈ ప్రకటన తరవాత ఎప్పుడెప్పుడు ఆప్టిమస్‌ని చూస్తామా అని టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ ఏడాది ఆగస్టు 19వ ఏఐ డే సందర్భంగా ఆప్టిమస్ ప్రోటోటైప్‌ని విడుదల చేయాల్సి ఉంది. కానీ ఏఐ డే ని సెప్టెంబర్ 30వ తేదీకి మార్చుతున్నట్టు ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. అప్పటి లోగా ఆప్టిమస్ ప్రోటోటైప్ తయారవుతుందని అందులో పేర్కొన్నారు. 


ఏంటీ ఆప్టిమస్ హ్యూమనాయిడ్..? 
ఆప్టిమస్. అచ్చం మనిషిని పోలి ఉండే రోబోట్‌ ఇది. 5.8 అడుగులు ఎత్తుండే ఆప్టిమస్ 57 కిలోల బరువుంటుంది. 20 కిలోల బరువుని సులువుగా మోయగలదు. విద్యుత్ వాహనాల్లో వినియోగించే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీనే ఆప్టిమస్‌ కోసమూ వాడుతున్నట్టు ప్రకటించారు ఎలన్ మస్క్. టెస్లా బాట్‌గానూ దీన్ని పిలుస్తున్నారు. గ్రాసరీ షాపింగ్ లాంటి పనులను చేయగలదు ఈ రోబో. ప్రస్తుతానికి వేరే ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఆప్టిమస్‌ పైనే దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఇప్పుడే కాదు గతంలోనూ పలు ఆవిష్కరణల ఇలా ప్రోటోటైప్స్ విడుదల చేస్తూ ట్రెండ్ సృష్టించారు మస్క్. ఇప్పుడు ఆప్టిమస్ హ్యూమనాయిడ్ ప్రోటోటైప్ రిలీజ్ పోస్ట్‌పోన్ అవటం వల్ల అంచనాలు ఇంకా పెరిగాయి. మిష్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న మస్క్ ఆప్టిమస్‌లో ఏ చిన్న లోపమూ ఉండకూడదని చాలా కచ్చితంగా చెప్పారట. అందుకే కాస్త ఆలస్యంగా విడుదల చేసినా అన్నీ పక్కాగా ఉండేలా చూస్తున్నారు సైంటిస్ట్‌లు. ఇక భవిష్యత్‌ అంతా రోబోలదేనని, ఫిజికల్‌ వర్క్ అనేది ఇకపై ఆప్షన్ మాత్రమే అని గతంలో మస్క్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. అందుకు అనుగుణంగానే ఆప్టిమస్‌ని తయారు చేస్తున్నారు.