CM Jagan Delhi Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. చర్చలో పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన ప్రధానంగా తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, మెడికల్ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపైనా సీఎం జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. ఇరువరి మధ్య దాదాపుగా గంట పాటు భేటీ జరిగింది.
ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులతో జగన్ భేటీలు
అమిత్ షా జగన్ మధ్య భేటీలో రాజకీయాలపైనా చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించాలంటే వైఎస్ఆర్‌సీపీ మద్దతు కీలకం అవుతుంది. ఈ అంశంపైనా చర్చించినట్లుగా చెబుతున్నారు. అమిత్ షాతో భేటీ తర్వాత సీఎం జగన్ తాడేపల్లి పయనం అయ్యారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ , గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు.
పోలవరం నిధులపై ప్రధానంగా దృష్టి
మంత్రలతో జరిగిన సమావేశాల్లో రాష్ట్ర అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా పోలవరం సవరించిన అంచనాలు, బకాయిల విడుదల తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. వివిధ పద్దుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. రుణ పరిమితిలో కోతలు విధించడం సరికాదని నివేదించారు. తర్వాత కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కూడా సమావేశమయ్యారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, నిధులు ఎప్పటికప్పుడు విడుదల తదితరాలను ప్రస్తావించారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే మద్దతని హామీ ఇచ్చారా ?
ఇటీవలే దావోస్‌లో పెట్టుబడుల సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన జగన్ రెండు రోజుల వ్యవధిలోనే ఢిల్లీ వెళ్లడంతో రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి ప్రారంభమయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతిస్తామని ఆయన కేంద్రానికి చెప్పడానికి వెళ్లారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇంతకు ముందే బీజేపీతో కాస్త దగ్గరగా ఉండే బిజూ జనతాదళ్ చీఫ్, ఒడిషా సీఎం కూడా ఇలాగే ప్రధానితో భేటీ అయ్యారని గుర్తు చేస్తున్నారు.