Electric Vehicles Exemption: 


పన్ను మినహాయింపులు 


కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. పెద్ద ఎత్తున తయారు చేసేందుకూ కంపెనీలకు సబ్సిడీలు అందిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని ఈవీలను తయారు చేసే స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. వీటి బ్యాటరీల తయారు చేసే అంకుర సంస్థలూ ఏర్పాటవుతున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలూ విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందంజలో ఉంది. సాధారణంగా వాహనాలు కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. అయితే విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి వీటి నుంచి మినహాయింపునిచ్చింది యూపీ ప్రభుత్వం. రోడ్ ట్యాక్స్‌తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజ్‌లనూ రద్దు చేసింది. మూడేళ్ల పాటు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఇటీవలే యోగి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. Electric Vehicle Manufacturing and Mobility Policy- 2022ని గతేడాది అక్టోబర్‌లోనే తయారు చేసింది ప్రభుత్వం. అయితే...దాదాపు 5 నెలల తరవాత ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది. 


సబ్సిడీలు 


కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వమూ రాయితీ ఇస్తోంది. మొత్తం రాయితీలతో కలుపుకుంటే టూ వీలర్స్‌పైన రూ.15-20 వేల వరకూ తగ్గింపు ఉంటుంది. అదే కార్లలో అయితే రూ.లక్ష వరకూ సబ్సిడీ వస్తుంది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి 100% రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. గతేడాది అక్టోబర్ 14వ తేదీ నుంచి రిజిస్టర్ అయిన వాహనాలు కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. 2025 అక్టోబర్ 13వ తేదీ వరకూ ఈ మినహాయింపులు కొనసాగనున్నాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే...రాష్ట్రంలోనే తయారైన విద్యుత్ వాహనాలకు ఈ ఆఫర్ ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. అయితే ఏయే విద్యుత్ వాహనాలకు ఈ మినహాయింపులు వర్తిస్తాయో కూడా వివరించింది. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం...బ్యాటరీలు, అల్ట్రా కెపాసిటర్లు, ఫ్యూయెల్ సెల్స్‌తో తయారు చేసే ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్న ఆటోమొబైల్స్‌ అన్నీ విద్యుత్ వాహనాలే. టూ, థ్రీ, ఫోర్ వీలర్స్ అన్నింటికీ ఇది వర్తిస్తుంది.  


లిథియం నిల్వలు..


బ్యాటరీల తయారీలో కీలకమైన "లిథియం" కోసం భారత్ చైనా, ఆస్ట్రేలియా దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. వీటిని దిగుమతి చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ఈ వ్యయం తగ్గించుకునేందుకు భారత్‌లోనే లిథియం నిల్వలు ఉన్నాయా లేదా అని సర్వే చేసింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI). జమ్ముకశ్మీర్‌లో భారీ రిజర్వ్‌లు ఉన్నట్టు గుర్తించింది. రీసీ జిల్లాలోని సలాల్ హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఢిల్లీకి 650 కిలోమీటర్ల దూరంలో ఈ నిల్వలను కనుగొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 51 రకాల మినరల్ బ్లాక్‌లను గుర్తించగా...అందులో లిథియం బ్లాక్ ఒకటి.విద్యుత్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది కేంద్రం. అయితే...ఈ వెహికిల్స్‌కి అవసరమైన బ్యాటరీలు తయారు చేయాలంటే లిథియం కచ్చితంగా అవసరం. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా లిథియంను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలు చైనా, ఆస్ట్రేలియా. భారత్ కూడా వీటిపైనే ఆధార పడుతోంది. ప్రధాన నగరాలన్నింటిలోనూ విద్యుత్ వాహనాల సంఖ్యను పెంచాలన్న లక్ష్యానికి లిథియం కొరత అడ్డంకింగా మారింది. అందుకే...GSI చాలా రోజుల పాటు సర్వే చేపట్టి జమ్ముకశ్మీర్‌లో ఈ నిల్వలను కనుగొంది. 


Also Read: Manish Sisodia Case: సిసోడియా అరెస్ట్‌పై ప్రతిపక్షాల ఆగ్రహం, ప్రధాని మోదీకి లేఖ రాసిన 9 మంది నేతలు