Manish Sisodia Case:
ఇది నిరంకుశత్వం: ప్రతిపక్ష నేతలు
మనీష్ సిసోడియా అరెస్ట్‌ను నిరసిస్తూ 9 మంది ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వీరిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారంటూ లేఖలో మండి పడ్డారు. ఈ 9 మంది నేతల్లో బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఈ అరెస్ట్‌లపై తీవ్రంగా స్పందించారు. ఉద్దేశపూర్వకంగా కొందరిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండి పడుతున్నారు. సిసోడియా అరెస్ట్‌ను ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. ఇటీవలే 8న్నర గంటల పాటు సిసోడియాను విచారించిన సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. డిప్యుటీ సీఎం పదవికి రాజీనామా చేశారు సిసోడియా.
పిటిషన్ తిరస్కరణ..
అయితే అంతకు ముందు సిసోడియా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. CBI అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించాలంటూ సూచించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. హైకోర్టులో ప్రత్యామ్నాయ మార్గాలు దొరికే అవకాశముందని వ్యాఖ్యానించింది. నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పిటిషన్ విచారించడం కుదరదని స్పష్టం చేశారు చీఫ్ జస్టిస్ డీపై చంద్రచూడ్. ఈ మేరకు తాము ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆప్ తెలిపింది. సిసోడియా వాదనలు విన్న ఆయన బెయిల్ పిటిషన్‌నూ కొట్టేసింది. మార్చి 6 వరకూ CBI కస్టడీని పొడిగించింది. మార్చి 10వ తేదీన మరోసారి విచారణ చేపడతామని వెల్లడించింది. సిసోడియా విచారణకు సరైన విధంగా సహకరించడం లేదని, కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగించాలని కోర్టుని కోరారు అధికారులు. ఈ మేరకు కోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. అయితే...సిసోడియా తరపు న్యాయవాది మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీనిపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే CBI నడుచుకుంటోందని విమర్శించారు. కచ్చితంగా అవకతవకలు జరిగాయని CBI చెబుతుంటే...అలాంటిదేమీ లేదని సిసోడియా తరపున న్యాయవాది వాదిస్తున్నారు. లిక్కర్ పాలసీలో కచ్చితంగా స్కామ్ జరిగిందని, అది కూడా చాలా సైలెంట్‌గా, ప్లాన్డ్‌గా చేశారని తేల్చి చెప్పింది. అంతే కాదు. సిసోడియాను A-1గా వెల్లడించింది.