మాజీ మంత్రి, సీఎం జగన్‌కు బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దూకుడుగా విచారణ చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్​ రెడ్డి విచారణకు రావాలని  మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇంతకుముందు గత నెలలో ఆయన్ను సీబీఐ రెండుసార్లు విచారణ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మార్చి 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లిసీబీఐ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులను అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి అందించినట్లుగా తెలుస్తోంది. భాస్కర్​ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల కిందట ఈ నెల 12న విచారణకు రావాలని ఆదేశించారు. మరోసారి నోటీసులు ఇచ్చి ఈ నెల 6వ తేదీనే రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఉంది. నిన్న రాత్రి పులివెందులకు వెళ్లి ఆరవ తేదీనే విచారణకు రావాలని చెప్పారు.


ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపు
వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతిని ఇద్దరు దుండగులు బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పులివెందులలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో స్వాతి నివసిస్తుండగా, శనివారం ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు దురుసుగా మాట్లాడారని ఆమె ఫిర్యాదు చేసింది. వివేకాను చంపింది నీ భర్తే కదా అంటూ గదమాయించారని వాపోయింది. ఎస్పీ ఆదేశాలతో సీఐ రాజు తన సిబ్బందితో హుటాహుటిన ఆమె ఇంటి వద్దకు వెళ్లారు. అప్పటికే ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు స్వాతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె చెప్పిన వివరాల మేరకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కడపకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.