Electoral Bonds Data Details: ఎలక్టోరల్ బాండ్స్ (Electoral Bonds Case) పూర్తి వివరాలు ఎన్నికల సంఘానికి అందజేసినట్టు SBI సుప్రీంకోర్టుకి ఇప్పటికే వెల్లడించింది. సీరియల్ నంబర్స్‌తో పాటు అన్ని వివరాలూ అందులో ఉన్నట్టు తెలిపింది. ఈ డేటా ప్రకారం మొత్తం రూ.12,145.87 కోట్ల మేర ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు అందాయి. ఇందులో 33%..అంటే రూ. 4,548.30 కోట్ల వరకూ పది మంది నుంచే అందాయి. ఈ డోనార్స్‌ జాబితానీ SBI వెల్లడించింది. లాటరీ కింగ్ Sebastian Martin సంస్థ Future Gaming and Hotel Services ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ కంపెనీ ఏకంగా రూ.1,365 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ని కొనుగోలు చేసింది.


రెండో స్థానంలో Megha Engineering & Infrastructures  కంపెనీ ఉంది. ఈ సంస్థ రూ.966 కోట్ల విలువైన బాండ్స్‌ని కొనుగోలు చేసినట్టు ఈ డేటా స్పష్టం చేసింది. రిలయన్స్ అనుబంధ సంస్థ Qwik Supply Chain రూ.410 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ని కొనుగోలు చేసింది. వేదాంత లిమిటెడ్ కంపెనీ రూ.400 కోట్లు, సంజీవ్ గోయెంకా గ్రూప్‌కి చెందిన Haldia Energy Ltd సంస్థ రూ.377 కోట్ల విలువైన బాండ్స్‌ని కొనుగోలు చేశాయి. మైనింగ్ సంస్థ Essel Mining రూ.224.5 కోట్ల విలువైన బాండ్స్‌ని కొనుగోలు చేయగా...Western UP Power Transmission Co. రూ.220 కోట్ల విలువైన బాండ్స్‌ని కొన్నట్టు ఈ డేటా వెల్లడించింది. మొత్తంగా చూస్తే...ఈ బాండ్స్ ద్వారా ఎక్కువగా లబ్ధి పొందింది బీజేపీయేనని స్పష్టమవుతోంది. 


గత నాలుగేళ్లలో బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ.6వేల కోట్ల విరాళాలు అందాయి. హైదరాబాద్‌కి చెందిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీయే బీజేపీకి ఎక్కువ మొత్తంలో విరాళం అందించింది. రూ.519 కోట్ల విలువైన బాండ్స్‌ని కొనుగోలు చేసింది. క్విక్ సప్లై కంపెనీ రూ.375 కోట్లు, వేదాంత గ్రూప్ రూ.226.7 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ రూ.183 కోట్ల విరాళాలు అందజేశాయి. పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ బీజేపీకి రూ.35 కోట్ల విరాళమిచ్చాడు. మరికొంత మంది వ్యక్తులు రూ.10-25 కోట్ల మధ్యలో బీజేపీకి డొనేట్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా బీజేపీ తరవాత ఆస్థాయిలో లబ్ధి పొందింది తృణమూల్ కాంగ్రెస్.


Future Gaming and Hotel Services కంపెనీ తృణమూల్ పార్టీకి రూ.542 కోట్ల విరాళాలిచ్చింది. హల్దియా ఎనర్జీ రూ.281 కోట్లు, ధారివల్ ఇన్‌ఫ్రా రూ.90 కోట్ల మేర డొనేట్ చేశాయి. ఈ విరాళాల విషయంలో తృణమూల్ తరవాతి స్థానంలో ఉంది కాంగ్రెస్. ఈ పార్టీకి వేదాంత కంపెనీ నుంచి రూ.125 కోట్ల విరాళాలు అందాయి. ఆ తరవాత Western UP Transmission Co రూ.110 కోట్లు, యశోద సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ నుంచి రూ.64 కోట్లు అందించింది. తెలంగాణలోని BRS పార్టీకి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ రూ.195 కోట్ల విరాళం ఇచ్చింది. యశోద హాస్పిటల్స్‌ BRSకి రూ.94 కోట్లు డొనేట్ చేసింది. తమిళనాడులో DMK పార్టీకి ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ రూ.503 కోట్ల విరాళమిచ్చినట్టు SBI డేటా వెల్లడించింది.