అంతర్జాతీయంగా తగ్గిన వంట నూనెల ధరలు
ఆరు నెలలుగా నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలకైతే కళ్లెం పడటం లేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. వంట నూనెలు తయారు చేసే సంస్థలు వెంటనే ధరలు తగ్గించాలని సూచించింది. లీటర్ నూనెపై
రూ.10 తగ్గించాలని కంపెనీలకు తెలిపింది. వారం రోజుల్లో ఈ మేర తగ్గించాలని స్పష్టం చేసింది. ఫుడ్ సెక్రటరీ సుధాంషు పాండే ఇదే విషయాన్ని వెల్లడించారు. ధరలు తగ్గించటంతో పాటు సంస్థలన్నీ దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులపై ఒకే ధర ఉండేలా చర్యలు చేపట్టాలనీ అడిగింది. నిజానికి అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు ఇటీవలే తగ్గాయి. ఈ నేపథ్యంలోనే ఆహార మంత్రిత్వ శాఖ వంట నూనెల తయారీ సంస్థలతో సమావేశమైంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున దేశీయంగా రిటైల్ ధరలు తగ్గించాలని చెప్పింది. " వారం రోజుల్లోనే అంతర్జాతీయంగా 10% ధరలు తగ్గాయని మేము గుర్తు చేశాం. ఈ మేరకు ప్రజలపై భారం తగ్గాల్సిందే. అందుకే తయారీ సంస్థలతోచర్చించాం" అని సుధాంషు పాండే వెల్లడించారు.
వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం: తయారీ సంస్థలు
నెల రోజుల్లోనే అంతర్జాతీయంగా ఒక్కో టన్ను వంట నూనెకు 300-450 డాలర్ల మేర తగ్గింది. చాలా వరకు తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపై లీటర్‌కు రూ.10-15 మేర కోత విధించాయి. వంట నూనె అవసరాల కోసం 60% వరకూ దిగుమతులపైనే ఆధారపడుతోంది భారత్. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం...జులై 6వ తేదీ నాటికి రిటైల్‌లో లీటర్ పామ్ ఆయిల్ ధర రూ. 144.16, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ. 185.77, సోయాబీన్ ఆయిల్ రూ.185.77గా ఉంది. అదే మస్టర్ట్ ఆయిల్ ధర రూ. 177.37 కాగా, పల్లి నూనె ధర రూ. 187.93గా ఉంది. అయితే కేంద్రం ఆదేశాల మేరకు పలు సంస్థలు పామ్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధరల్ని రూ.10 మేర తగ్గించేందుకు సుముఖత చూపించాయి. వారం రోజుల్లో ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. ముందు ఈ నూనెల ధరలు తగ్గితే మిగతా వంట నూనెల ధరలూ తగ్గే అవకాశముందని అంటోంది కేంద్రం.
ఇక్కడే మరో కీలక విషయాన్నీ ప్రస్తావించింది. దేశంలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధరలు ఉండటంపై చర్చించింది. కనీసం రూ.3-5 వరకు ధరల్లో తేడా ఉంటోందని, ఇలా కాకుండా అంతటా ఒకటే ధర ఉండేలా చూడాలని చెప్పింది. రవాణా ఖర్చులతో సహా కలిపి MRP నిర్ణయించినప్పుడు, మళ్లీ ధరల్లో వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించింది.
Also Read: Tapsee Pannu: తాప్సీలా మీరు నిల్చోగలరా? అమ్మో కష్టమే