Droupadi Murmu Santhali Saree: 


ప్రమాణస్వీకారంలో ఆ చీర ధరిస్తారా? 


భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే చీరలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ద్రౌపది ముర్ము కోసం, ఆమె వదిన ఈ చీరను ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. సంతల్ వర్గానికి చెందిన మహిళలు ధరించే ఈ చీరను ద్రౌపది ముర్ముకు బహుకరిస్తానని ఆమె వదిన సుక్రీ తుడు చెబుతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే దిల్లీకి పయనమయ్యారు ఆమె వదిన సుక్రీ. "ద్రౌపది కోసం నేను ప్రత్యేకంగా సంతాలీ చీరను పట్టుకొస్తున్నాను. ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఆమె ఈ చీరే కట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఆమె కచ్చితంగా ఈ చీరే కట్టుకుంటారని అనుకోవట్లేదు. రాష్ట్రపతి భవన్ నిర్ణయించిన ఆధారంగా, డ్రెస్‌ కోడ్ ఫాలో అవుతారేమో" అని అభిప్రాయపడ్డారు. ఈ సంతాలీ చీరలు ఎంతో ఫేమస్. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మహిళలు ఈ చీరలు ధరిస్తారు. ఓ అంచులో స్ట్రైప్ వర్క్‌తో, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఉంటాయి ఈ చీరలు. ద్రౌపది ముర్ము సొంత ఊరైన రాయ్‌రంగాపూర్‌లోనే నివసిస్తున్న సుక్రీ, సంతాలీ చీరతో పాటు స్పెషల్ స్వీట్‌ ప్యాక్‌ను కూడా తీసుకొస్తున్నట్టు చెప్పారు. "అరిస పిత" అనే ప్రత్యేక మిఠాయిలు ఆమెకు ఇస్తానని అన్నారు. 


నలుగురు కుటుంబ సభ్యుల సమక్షంలో..


ద్రౌపది ముర్ము కుటుంబ సభ్యుల్లో నలుగురు మాత్రమే ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారని భాజపా సీనియర్ నేతలు వెల్లడించారు. ఆమె సోదరుడు, వదిన, కూతురు, అల్లుడు హాజరవనున్నారు. భాజపా అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కూడా ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవనున్నారు. ఆయనతో పాటు మయూర్‌భంజ్‌కు చెందిన ఆరుగురు భాజపా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రదాన్, బిశ్వేశ్వర్ తుడు, ఎంపీలు సురేశ్ పుజారి, బసంత్ పాండా, సంగీత కుమార సింగ్దియో, ఆమె భర్త కేవి సింగ్దియో  ద్రౌపది ముర్ముని దిల్లీలో కలిశారు. వాళ్లు కూడా ఈ కార్యక్రమంలోపాల్గొననున్నారు. కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటి నుంచి ద్రౌపది ముర్ము విజయంపైనే సానుకూల సంకేతాలు వచ్చాయి. తొలి గిరిజన రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టిస్తారని, పేరు ప్రకటించిన సమయంలోనే అంతా అంచనా వేశారు. ఆ అంచనాలు నిజం చేస్తూ...ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు ద్రౌపది ముర్ము. ఝార్ఖండ్ గవర్నర్‌గా పని చేసిన ముర్ము, పరిపాలనాపరమైన విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారని ఆమె సన్నిహితులు చెబుతుంటారు.