జమ్ముకశ్మీర్‌లో డ్రోన్ల సంచారం మరోసారి కలకలం రేపింది. భారత సరిహద్దుకు సమీపంలో ఓ డ్రోన్‌ను గుర్తించిన పోలీసులు కాల్పులు జరిపారు. అందులో 5 కిలోల వరకు పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.


కనచక్‌ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురువారం రాత్రి ఓ డ్రోన్‌ సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యాంటీ-డ్రోన్‌ స్ట్రాటజీ ద్వారా దానిపై కాల్పులు జరిపారు. ఈ డ్రోన్‌ దేశ సరిహద్దును దాటుకుని భారత భూభాగం వైపు దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల లోపలకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీన్ని హెక్సాకాప్టర్‌గా గుర్తించారు.


పేలుడు పదార్థాలు..


కూల్చివేసిన అనంతరం డ్రోన్‌ను తనిఖీ చేయగా.. అందులో 5 కిలోల వరకు పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వీటిని అత్యంత శక్తిమంతమైన ఐఈడీ బాంబుల తయారీకి ఉపయోగిస్తారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.


గత నెల జమ్మూలోని వైమానిక స్థావరంపై డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత సరిహద్దుల్లో పలుమార్లు డ్రోన్ల కదలికలను అధికారులు గుర్తించారు. దీంతో జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. యాంటీ- డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.


వరుస ఘటనాలు..


జమ్మూలోని వైమానిక దళం స్థావరంపై ఇటీవల డేగల వంటి అజ్ఞాత డ్రోన్లు పేలుడు పదార్థాలను జారవిడవడం భద్రతా దళాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. భారత్‌ అత్యాధునిక యుద్ధసామర్థ్యాలకు ఇది పరీక్ష. డ్రోన్‌ ను ముందే పసిగట్టడం లేదా కూల్చివేయడం సంగతి పక్కన పెడితే, కనీసం అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వెంటనే గుర్తించలేకపోయారు. ఆ తరవాత పలు డ్రోన్లు వివిధ సైనిక స్థావరాల సమీపంలో దర్శనమిచ్చాయి. భారత్‌ వేగంగా మేలుకోకపోతే వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పాక్‌, దాని ఉగ్రసంస్థలకు అప్పనంగా అప్పజెప్పినట్లేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కొంతకాలంగా కశ్మీర్‌లో భారత సైన్యం వ్యూహాత్మకంగా ముందడుగు వేయడం వల్ల స్థానికులు ఉగ్రవాదం వైపు మళ్లడం కొంత తగ్గింది. ఫలితంగా పాక్‌ ఇప్పుడు డ్రోన్లపై దృష్టి పెట్టింది. భూమికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల వీటి ఆచూకీ గుర్తించడం రాడార్లకు కష్టం. చౌకగా లభించే వాణిజ్యశ్రేణి క్వాడ్‌కాప్టర్లు సైతం.. సరిహద్దుల్లోని గగనతల రక్షణ వ్యవస్థ రాడార్లు, కమ్యూనికేషన్‌ కేంద్రాలు, రాకెట్‌ లాంఛర్లను దెబ్బతీయగలవు. ఇలాంటి పరిస్థితినే అజర్‌బైజాన్‌తో యుద్ధంలో అర్మీనియా ఎదుర్కొంది.


ALSO READ:


Drone War: ఇక ఆయుధాలు మాయం.. అంతా 'డ్రోన్ల' మయం