యంగ్ ప్లేయర్లతో కూడిన టీమిండియా... శ్రీలంక గడ్డపై అదరగొడుతోంది. లంక జట్టుపై సిరీస్ అసాంతం ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ తొలి రెండు వన్డేల్లో ఘనవిజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో టీమిండియా రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించే అవకాశం ఉంది. మరోవైపు శ్రీలంక పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రెండో వన్డేలో అద్భుతంగా రాణించినా విజయం ముంగిట ఆ జట్టు బోల్తా పడింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను త్వరగానే పెవిలియన్ చేర్చిన ఆ జట్టు.. ఆఖరి వికెట్లు తీయలేక చేతులెత్తేసి ఓటమి మూటగట్టుకుంది. దీంతో మూడో వన్డేలోనైనా సత్తా చాటి.. పరువు దక్కించుకోవాలని లంకేయులు భావిస్తున్నారు. మరోవైపు, మూడో వన్డేలోనూ విజయం సాధించి...లంకను వైట్ వాష్ చేయాలని గబ్బర్ సేన భావిస్తోంది.
తొలి రెండు వన్డేల్లో గబ్బర్ సేన దుమ్మురేపింది. గెలవాలనే కసితో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ రిజర్వ్ బెంచ్‌ను ఆడించే అవకాశం ఉంది. అయితే ఎవరిని తీసి మరెవరిని ఆడిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. గాయం నుంచి కోలుకున్న సంజూ శాంసన్‌కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ స్థానంలో అతనికి చోటు దక్కవచ్చు. ఇక రెండో వన్డేలో విఫలమైన కుల్దీప్ స్థానంలో రాహుల్ చాహర్ లేదా వరుణ్ చక్రవర్తిల్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది.
నవ్‌దీప్ సైనీకి కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తే దీపక్ చాహర్‌కు విశ్రాంతి ఇవ్వొచ్చు. టీ20 సిరీస్‌కు సిద్దమయ్యేందుకు రేపటి మ్యాచ్ నుంచి మినహాయింపు లభించవచ్చు. మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
మరోవైపు, రెండో వన్డేలో శ్రీలంక మెరుగైన ప్రదర్శన చేసింది. నిజానికి ఆ జట్టు గెలుపు ముంగిట బోల్తాపడింది. టీమిండియా బ్యాట్స్‌మన్‌కు తగ్గట్లు ప్లాన్ చేసిన ఆ టీమ్.. చివర్లో అనుభవలేమి ఆటతో చేజేతులా విజయాన్ని దూరం చేసుకుంది. గత మ్యాచ్‌లో గాయపడ్డ భానుక రాజపక్స్ స్థానంలో పాతుమ్ నిస్సంకను తీసుకోవచ్చు. రెండో వన్డేలో ధారళంగా పరుగులిచ్చిన లక్షన్ సందకన్ స్థానంలో అకిలా ధనంజయకు అవకాశం ఇవ్వచ్చు.
భారత తుది జట్టు (అంచనా)
శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్/ సంజూ శాంసన్(కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్/నవ్‌దీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్/రాహుల్ చాహర్/వరుణ్ చక్రవర్తీ
లంక తుది జట్టు (అంచనా)
అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స, ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, కసున్ రజితా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ