భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుస పరాజయాలతో ఢీలాపడిపోయిన శ్రీలంక టీమ్‌కి మరో షాక్ తగిలింది. నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఆ జట్టుకు జరిమానా విధించారు.




ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మడుగలె.. లంకేయుల మ్యాచు ఫీజులో 20% కోత విధించారు. అంతేకాకుండా సూపర్‌ లీగ్‌ పాయింట్లలో ఒక పాయింట్‌ కోత పెట్టారు. కెప్టెన్‌ శనక పొరపాటును అంగీకరించడంతో ఎలాంటి విచారణ జరగలేదు. మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ (19 నాటౌట్)తో కలిసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన దీపక్ చాహర్.. 8వ వికెట్‌కి అజేయంగా 84 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. ఈ జోడీని విడదీసేందుకు శ్రీలంక కెప్టెన్ దసున్ షనక.. చివరి వరకూ బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ కూర్పుపై సహచరులతో చర్చలు జరుపుతూ కనిపించాడు. దాంతో.. మ్యాచ్ సమయం వేస్ట్ అయినట్లు మ్యాచ్ రిఫరీ రంజన్ తేల్చాడు.


కేటాయించిన సమయంలోపు శ్రీలంక టీమ్‌ వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్‌‌ని తక్కువగా వేసింది. దాంతో.. నిబంధనల ప్రకారం.. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద ఆ జట్టులోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా పడింది. భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగానే శుక్రవారం చివరిదైన మూడో వన్డే జరగనుంది. ఈ సిరీస్‌లోనే మరోసారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి శ్రీలంక పాల్పడితే.. జరిమానా రెట్టింపుకానుంది. 


చివరి వన్డేలో గెలిచి పరువు కాపాడుకోవాలని శ్రీలంక చూస్తోంది. మరోపక్క టీమిండియా ఈ వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఉబలాటపడుతోంది. ఈ రోజు జరిగే వన్డేలో ఇరు జట్లు భారీగానే మార్పులు చేయనున్నాయి. ఇప్పికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ రిజర్వ్ బెంచ్‌కి పరిమితం చేసిన ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేలా ఉంది. దేవదత్ పల్లికల్‌తో పాటు మరికొందరికి అరంగేట్రం చేసే అవకాశం వస్తుందేమో చూడాలి. అలాగే శ్రీలంక ఈ మ్యాచ్లో విజయం కోసం బలమైన జట్టును బరిలోకి దించే ఆలోచనలో ఉంది. రెండో వన్డేలో ధారళంగా పరుగులు ఇచ్చిన సందకన్‌కు మొండి చెయ్యి చూపించాలనుకుంటోంది. మరి ఏ జట్టు ఎన్ని మార్పులతో బరిలోకి దిగుతుంది? ఏ జట్టు విజయం సాధిస్తుందో చూద్దాం.    


వన్డే సిరీస్ అనంతరం భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ నెల 25, 27, 29 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి.  5 టస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత - ఎ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత - బి జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది.