శ్రీలంక ప్రధాన మంత్రి దినేష్ గుణవర్దెన
శ్రీలంక ప్రధాన మంత్రిగా సీనియర్ నేత దినేష్ గుణవర్దెన ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. 73 ఏళ్ల దినేష్ గుణవర్దెన గతంలో విదేశాంగ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గొటబయ రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హోం మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మొన్నటి వరకూ ప్రధానిగా రణిల్ విక్రమసింఘే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ప్రధాని పదవి ఖాళీగానే ఉంది. ఇప్పుడు దినేశ్‌ను ప్రధానిగా నియమించారు. ఆసక్తికర విషయమేంటంటే రణిల్ విక్రమసింఘే,దినేష్ గుణవర్దెన ఒకే స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. రాజపక్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడు..దినేష్. 1973లో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఆయన..అంతకు ముందు ఇంటర్నేషనల్ బిజినెస్‌లో డిప్లొమా పట్టా పొందారు. 1983లో మగరగమ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2018 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ హౌజ్ లీడర్‌గా ఉన్నారు. తరవాత 2020లో జనవరి నుంచి ఆగస్టు వరకూ, ఆగస్టు నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు వరకూ హౌజ్ లీడర్‌గానే కొనసాగారు.
ఆర్థిక సంక్షోభం ఎప్పుడు తీరిపోతుందో..?
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. గత అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వదిలి పారిపోయారు. నిరసనకారులు ఆయన ఇంటిని ముట్టడించి, లోపలకు వెళ్లడం లాంటి పరిణామాలు అక్కడి ప్రజాగ్రహాన్ని కళ్లకు కట్టాయి. తరవాత ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిరనసలు చేపట్టారు. కానీ...అందుకు ఆయన ససేమిరా అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక కానీ రాజీనామా చేయనని తేల్చి చెప్పారు. ఫలితంగా...ఆయన ఇంటిపైనా దాడి చేశారు ఆందోళకారులు. గత అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేశాక, పార్లమెంట్‌లో ఓటింగ్ నిర్వహించి, ప్రధాని రణిల్ విక్రమసింఘేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇది ప్రజాగ్రహాన్ని ఇంకా పెంచింది. రాజపక్స కుటుంబాన్ని సన్నిహితుడైన రణిల్ విక్రమసింఘే, దేశాన్ని ఇంకా నాశనం చేస్తారంటూ ప్రజలు తీవ్రంగా నిరసించారు.
ప్రెసిడెంట్ సెక్రటేరియట్‌నూ ముట్టడించారు. సెక్రటేరియట్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించగా...లంక సైన్యం వచ్చి వారిని అడ్డుకుంది. ఇప్పటికే అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లను స్వాధీనంచేసుకున్న ఆందోళనకారులు తరవాత బయటకు వచ్చారు. ఈ క్రమంలో నిరసనకారులు, సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు బారికేడ్లు పెట్టి వారిని అడ్డుకున్నారు. రణిల్ విక్రమసింఘేను అధ్యక్షుడిగా ఎన్నుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రజల ప్రభుత్వం వచ్చినప్పుడే మాకు మనశ్శాంతి" అని వాళ్లు చెబుతున్నారు. "కావాలనే మమ్మల్ని అణిచివేస్తున్నారు. ఇదంతా రణిల్ విక్రమసింఘే చేయిస్తున్నదే. కానీ మేము వెనక్కి తగ్గం. దేశాన్ని ఈ కుటిల రాజకీయాల నుంచి కాపాడుకుంటాం" అని నినదిస్తున్నారు.