Draupadi Murmu: అందరి అంచనాలను నిజయం చేస్తూ.. భారత 15వ రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళిగా ద్రౌపది ఎన్నిక కావడంపై.. బీజేపీ నాయకులు, ఆదివాసీ ప్రజలు సంబురాలు చేస్కుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. 


టపాసులు పేలుస్తూ.. మిఠాయిలు తినిపించుకుంటూ...


ముఖ్యంగా  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ద్రౌపది ముర్ము విజయాన్ని పండుగలా చేసుకుంటున్నారు. జైనూర్ మండల కేంద్రంలోని కుమురం భీం చౌరస్తాలో ఆదివాసీ మహిళలు, బీజేపీ నాయకులు టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అటు ఉట్నూర్ మండల కేంద్రంలో కూడా టపాసులు పేల్చారు. ద్రౌపది ముర్ము విజయానికి సంతోషిస్తూ.. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. డోలు వాయిద్యాలతో ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ జాతికి కూడా సరైన అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 


ఒడిశాలోనూ పండుగ వాతావరణం..


వీవీ గిరి తర్వాత ఒడిశా నుంచి అత్యున్నత పదవి చేపట్టబోతున్న నాయకురాలు ద్రౌపది కావడంతో ఆ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. బీజేపీ ఈ విజయాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహిస్తోంది. దిల్లీలోని ప్రధాన వీధుల్లో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి మేళ తాళాలతో విజయ దుందుభి మోగించింది. ఈనెల 25వ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ఆమె ప్రమాణం చేయబోతున్నారు. రాష్ట్పరతి చేత తెలుగు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే మొదటి సారి అవుతుంది. 


శుభాకాంక్షల వెల్లువ..


రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ప్రధాని మోదీ ఆమె ఇంటికి వెళ్లారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ముర్మును అబినందించారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నూతనంగా ఎన్నికైన ద్రౌపదికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా కూడా ముర్ముకు అభినందనలు తెలిపారు. ఆమెకు ఓటు వేసిన ఎన్డీఏ పక్షాలకు, మిగతా పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ముర్ము తన పదవీ కాలంలో దేశం గర్వపడేలా పని చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా నూతనంగా  ఎన్నికైన రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ద్రౌపదికి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ మహిళ దేస అత్యున్నత పీఠంపై కూర్చోవడం... ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం అన్నారు. భారతదేశం గర్వించేలా ద్రౌపది ముర్ము పని చేస్తారని నమ్మకం తనకు ఉందని తలిపారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ముర్ముకు అభినందనలు తెలిపారు. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికవడంతో ఆమె ఇంటి వద్ద సంబురాలు హోరెత్తాయి. ఆమె ఇంటి వద్ద ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలతో వేడుకలు చేసుకున్నారు.