తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తుతో జరిగిన వరద నష్టాల పై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్రానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1400 కోట్లు వరద నష్టం జరిగినట్టు  కేంద్రానికి నివేదికలు అందించింది. రూ.1000 కోట్లను తక్షణ సాయం కింద విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.


వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు కొట్టుకపోవడం వంటి కారణాలతో రోడ్లు భవనాల శాఖకు రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయతీ రాజ్ శాఖలో రూ. 449 కోట్లు, ఇరిగేషన్ డిపార్టమెంట్‌కు రూ. 33 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో రూ. 379 కోట్లు, విద్యుత్ శాఖలో రూ. 7 కోట్లు నష్టం జరిగినట్టు ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఈ మేరకు ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికలు సిద్దం చేసి కేంద్రానికి అందజేశాయి. 


కూలిపోయిన ఇల్లు, ముంపునకు గురికావడంతో జనాలను తరలించేందుకు రూ. 25 కోట్లు ఖర్చు పెట్టినట్టు పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన నష్టాలతో కలుపుకొని రూ. 1400 కోట్ల మేర రాష్ట్రంలో వరద నష్టం జరిగిందని అధికారులు నివేదికలు సిద్దం చేసి కేంద్రానికి పంపారు.


ఇప్పటికే ఈ సాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ పంపించిన నివేదికపై కేంద్రం ఎలా స్పందిస్తోందో చూడాలి.