Dhruva Space:
ఇస్రోతో కలిసి ప్రయోగాలు..
ఇండియాలో టాలెంట్ పూల్‌కు కొదవే లేదు. అందుకే...ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఇండియన్స్ విదేశాల్లోని కంపెనీల్లో పని చేస్తూ..మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మ్యాన్ పవర్ విషయంలోనూ భారత్ ముందంజలో ఉంటుంది. కేవలం విదేశాల్లోనే కాదు. స్వదేశంలోనూ తమ సొంతకాళ్లపై నిలబడి టెక్ దిగ్గజ సంస్థలకూ పోటీనిస్తున్నారు కొందరు యువతీ యువకులు. స్టార్టప్‌లతో ప్రయాణం మొదలు పెట్టి ఒక్కో మైలు రాయి దాటుకుంటూ...అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. ఇలాంటి అంకుర సంస్థల్లో ఒకటి "Dhruva Space".అంతరిక్ష రంగంలోకి అడుగు పెట్టడం అంటే అంత సులభం కాదు. ఎంతో నాలెడ్జ్ ఉండాలి. మార్కెట్‌కు తగ్గట్టుగా తమను తాము మలుచుకోవాలి. ప్రపంచదేశాల్లో ఎలాంటి టెక్నాలజీ ఉందో తెలుసుకోవాలి. ఇప్పటి వరకూ లేనిదేముంది..? కొత్తగా ఏం చేయగలం..? అని బుర్ర బద్దలు కొట్టుకోవాలి. ఈ సవాళ్లన్నింటినీ దాటుకుని వచ్చింది ధ్రువ స్పేస్ సంస్థ. భారత్‌లోని స్పేస్ సెక్టార్‌లో ఉన్న మేటి సంస్థగా పేరు తెచ్చుకుంది..
హైదరాబాద్‌లోని ధ్రువ స్పేస్. ఉపగ్రహాలు తయారు చేయడమే ఈ కంపెనీ పని. ఈ ఏడాది జూన్‌లో ఇస్రో PSLV C53 ద్వారా ధ్రువ స్పేస్ తయారు చేసిన Satellite Orbital Deployer (DSOD 1U)ని విజయవంతంగా ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇదే కీలక మలుపు. ఇప్పటి వరకూ ఎప్పుడూ ప్రైవేట్ సంస్థ తయారు చేసిన శాటిలైట్స్‌ని స్పేస్‌లోకి పంపలేదు. ఆ చరిత్రను తిరగరాస్తూ...ఇప్పుడు ధ్రువ స్పేస్
ఇస్రోతో కలిసి మరి కొన్ని ప్రయోగాలకు రెడీ అవుతోంది. ఇస్రో తొందర్లోనే PSLV C54 మిషన్‌కు సిద్ధమవుతోంది. ఈ మిషన్ ద్వారా ధ్రువ స్పేస్ తయారు చేసిన Thybolt-1, Thybolt-2 శాటిలైట్స్‌ని స్పేస్‌లోకి పంపనున్నారు.
2012లో మొదలైన ప్రస్థానం..
2012లో సంజయ్ నెక్కంటి, చైతన్య దొర సురపురెడ్డి, అభయ్ ఇగూర్, కృష్ణతేజ పెనమాకురు కలిసి ధ్రువ స్పేస్ సంస్థను నెలకొల్పారు. చిన్న చిన్న ఉపగ్రహాలు తయారు చేయడం మొదలు పెట్టారు. కమర్షియల్‌తో పాటు ప్రభుత్వానికి ఉపకరించే శాటిలైట్స్‌నీ తయారు చేస్తున్నారు. శాటిలైట్ తయారీ నుంచి లాంచింగ్ వరకూ అన్ని సర్వీస్‌లనూ అందిస్తోంది ఈ కంపెనీ. భారత్‌తో పాటు, గ్రాజ్, ఆస్ట్రియాలో ఈ కంపెనీ బ్రాంచ్‌లున్నాయి. ఇప్పటి వరకూ IAN Fund,బ్లూ అశ్వ క్యాపిటల్ కంపెనీల నుంచి రూ.26.5కోట్ల ఫండ్స్‌ని రాబట్టగలిగింది ధ్రువ్‌స్పేస్.
ఆలోచన ఎప్పుడు మొదలైంది..?
2011లో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కోసం సంజయ్ నెక్కంటి తొలిసారి SRMSAT శాటిలైట్‌ను తయారు చేశాడు. ఆ తరవాత స్పేస్ రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు. స్వీడన్, ఫ్రాన్స్‌లో స్పేస్ ఇంజనీరింగ్‌లో డ్యుయల్ డిగ్రీ మాస్టర్స్ చేశాడు. ఆ సమయంలోనే ఇండియాను "శాటిలైట్ మేకింగ్ హబ్"గా మార్చాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే భారత్‌కు వచ్చేశాడు. 2012లో Dhruva Space Private Limited ను ప్రారంభించారు. అయితే..2015లో Thybolt కంపెనీ శాటిలైట్ తయారు చేయాలని ధ్రువ స్పేస్‌ను సంప్రదించింది. అప్పుడే...సంజయ్ నెక్కంటి...తన ఫ్రెండ్స్‌ని కలిశాడు. స్పేస్‌టెక్ సెక్టార్‌లో వాళ్లకూ ఆసక్తి ఉందని తెలుసుకుని...చేతులు కలిపారు. వీళ్లంతా కలిసి Thybolt శాటిలైట్‌ను తయారు
చేసేందుకు సంకల్పించారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన శాటిలైట్‌ను లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సవాళ్లు..
కంపెనీ పెట్టగానే సరిపోదు. ఎన్నో సవాళ్లు అధిగమించాలి. ముఖ్యంగా..అంతరిక్ష రంగంలో స్టార్టప్స్ తక్కువగా ఉన్నాయి. మార్కెట్‌లో ఎలా నిలబడాలన్నదీ అప్పటికీ అర్థం కాలేదు. ప్రైవేట్ కంపెనీలు ఇస్రోతో కలిసి శాటిలైట్స్ తయారు చేయడమూ చాలా తక్కువ. "మేం ధ్రువ స్పేస్‌ను మొదలు పెట్టినప్పుడు మార్కెట్ గురించి పెద్దగా తెలియదు. పెట్టుబడులు కూడా తక్కువే ఉన్నాయి. అప్పటికి ప్రైవేట్ స్పేస్‌టెక్ సెక్టార్‌ను హైరిస్క్ డొమైన్‌గా పిలిచేవారు. కానీ...ఏళ్లు గడిచే కొద్దీ...పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు మా కంపెనీ రూ.26.5 కోట్ల పెట్టుబడులు రాబట్టుకోగలిగింది" అని వివరించాడు సంజయ్ నెక్కంటి. ప్రస్తుతం ధ్రువ స్పేస్ కంపెనీ IIT హైదరాబాద్, SNISTతో కలిసి పని చేస్తోంది. స్పేస్ యాక్టివిటీస్‌ను పెంచేందుకు NewSpace India Limitedతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్టు ధ్రువ స్పేస్ కంపెనీ వెల్లడించింది.
Also Read: Skyroot Aerospace: స్కైరూట్ రాకెట్ సక్సెస్ - ఈ ప్రయోగం బ్యాక్‌గ్రౌండ్ గురించి మీకు తెలుసా?