Skyroot Aerospace: హైదరాబాదీ కంపెనీ స్కైరూట్‌ (Skyroot Aerospace Pvt Ltd) పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ కంపెనీ తయారు చేసిన తొలి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం అయింది.
 
స్కైరూట్‌ ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లే స్పేస్‌ లాంచ్‌ వెహికల్స్‌ను ఈ ప్రైవేటు కంపెనీ తయారు చేస్తుంది. స్పేస్‌ లాంచ్‌ వెహికల్స్‌ను సాధారణంగా రాకెట్లు అని పిలుస్తారు. ఈ కంపెనీ ఇప్పటికే ఒక రాకెట్‌ తయారు చేసింది. దాని పేరు విక్రమ్‌-S. భారత అంతరిక్ష రంగ పితామహుడు, ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా విక్రమ్‌-ఎస్‌ పేరును ఖరారు చేసింది. 


మన దేశంలో, రాకెట్ల తయారీలో ఇస్రోదే (ISRO- Indian Space Research Organisation) ఏకఛత్రాధిపత్యం. ఆ సీటుకు బీటలు కొడుతూ, రాకెట్‌ తయారు చేసిన తొలి ప్రైవేటు కంపెనీగా స్కైరూట్‌ చరిత్రలోకి ఎక్కింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ప్రయోగించారు. ఇందుకోసం ఇస్రోతో ఒక ఒప్పందాన్ని స్కైరూట్‌ కుదుర్చుకుంది.


ఇస్రో ఆధిపత్యానికి గండి కొట్టిందంటే ఇది మహా ముదురు కంపెనీ అనుకోవద్దు. సంస్థను స్థాపించి కేవలం నాలుగేళ్లు మాత్రమే అయింది. ఈ నాలుగేళ్ల కాలంలోనే నిధులు సేకరించి, ఒక రాకెట్‌ తయారు చేసి వినువీధిలోకి వదిలారంటే ఈ కంపెనీ టాలెంట్‌ ఎంత గట్టిదో అర్ధం చేసుకోవచ్చు. 


విక్రమ్‌-ఎస్‌ లాంచింగ్‌ వెహికల్‌ ప్రత్యేకతలేంటి? 
దేశంలో తొలి ప్రైవేట్‌ రాకెట్‌
ఈ ప్రయోగం కోసం రూ.403 కోట్ల ఖర్చు
భూమికి 103 కి.మీ. ఎత్తులోని కక్షలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం
సబ్-ఆర్బిటల్ సాలిడ్-స్టేజ్ రాకెట్ 
3D-ప్రింటెడ్ మోటార్లతో రూపొందించారు 
మూడు కస్టమర్ పేలోడ్‌లను ఇది మోస్తుంది.


స్కైరూట్‌ గురించి
స్కైరూట్‌ ఫౌండర్లు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా. వీళ్లలో...చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (CEO)  పవన్‌ కుమార్‌, చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌గా నాగ భరత్ బాధ్యతలు మోస్తున్నారు. వీళ్లిద్దరూ ఐఐటీ పూర్వ విద్యార్థులు.  అంతరిక్ష ప్రయోగాల మీద మోజుతో ఇస్రోలో చేరారు. సొంతంగా ఎదగాలన్న పట్టుదలతో, ఇస్రోలో చేస్తున్న ఉద్యోగాలను విడిచిపెట్టారు. ఒక స్పేస్ టెక్నాలజీ స్టార్టప్‌ను ప్రారంభించి, స్పేస్‌ లాంచింగ్‌ వెహికల్స్‌ను సొంతంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతరిక్షంలోకి వెళ్లే ఉపగ్రహాల సంఖ్య ఏటికేడు భారీగా పెరుగుతుండడం, ఆ సెక్టార్‌లో కనిపిస్తున్న డిమాండ్‌ వీళ్లను ప్రోత్సహించింది.


2018 జూన్‌ 12న స్కైరూట్ ఏరోస్పేస్‌ను ప్రారంభించారు. అప్పటికి భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ ప్లేయర్లు లేరు. ప్రభుత్వ రంగంలోని ఇస్రో మాత్రమే ఉంది. 


నాలుగేళ్ల శ్రమ తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి ఎగిరింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థతో స్కైరూట్‌ను ప్రపంచం పోలుస్తోంది.


విక్రమ్‌ సారాభాయ్‌ పేరు పెట్టిన ఈ రాకెట్‌లో మరో స్పెషాలిటీ ఏంటంటే.. కార్బన్ కాంపోజిట్‌తో, 3Dలో ప్రింట్‌ చేసిన మోటార్లను ఇందులో ఉపయోగించారు. ఈ సబ్-ఆర్బిటల్ సాలిడ్-స్టేజ్ రాకెట్ మూడు పేలోడ్‌లను మోస్తుంది. ఈ కార్యక్రమానికి
మిషన్ ప్రారంభ్ (ప్రారంభం) అని పేరు పెట్టారు. 


భారతదేశ అంతరిక్ష ప్రయోగాలు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. అయినా... అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్‌ రంగాన్ని ప్రోత్సహించడంలో మనం చాలా  వెనుకబడి ఉన్నాం. ఈ నేపథ్యంలో.. స్కైరూట్ ప్రయోగం దేశ అంతరిక్ష చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.


ఎలా మొదలైంది?
32 ఏళ్ల పవన్‌ కుమార్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో రాకెట్రీ & స్పేస్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాస్టర్‌ డిగ్రీ కోసం నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) తరపున ఒక ప్రాజెక్ట్‌లో పనిచేశారు. IIT క్రయోజెనిక్ ఇంజనీరింగ్ సెంటర్‌లోనూ ఇస్రోతో కలిసి పని చేశారు. నాగ భరత్, ఐఐటీ-మద్రాస్ విద్యార్థి. 


ఈ ఇద్దరూ ఒకే సమయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2012లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా ఇస్రోలో ఉద్యోగం సంపాదించారు. ఇస్రోలో కలుసుకునే వరకు ఇద్దరికీ పరిచయం లేదు. 


పవన్ కుమార్‌ శాస్త్రవేత్తగా, నాగ భరత ఏవియానిక్స్ ఇంజినీర్‌గా ఇస్రోలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. లాంచ్‌ వెహికల్స్‌ మీద ఆరేళ్ల పాటు అక్కడ పని చేశారు. GSLV మార్క్-3 ప్రోగ్రామ్‌లో భాగమయ్యారు. దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అతి పెద్ద రాకెట్ అది. 


GSLV మార్క్-3 ప్రోగ్రామ్‌ అనుభవం తర్వాత రాకెట్ల మీద ఇద్దరికీ ఉన్న ఆసక్తి మరో వంద రెట్లు పెరిగింది. అంతర్జాతీయంగా అంతరిక్ష వాణిజ్య పరిశ్రమ వృద్ధిలో కనిపిస్తున్న వేగాన్ని గమనించారు. భారతదేశంలో కూడా అలాంటి ఎకో సిస్టమ్‌ డెవలప్‌ చేయాలన్న ఉద్దేశంతో.. చేయి, చేయి కలిపారు. స్కైరూట్‌కు బీజం అక్కడే పడింది. కల సాక్షాత్కారమైంది.