Farooq Abdullah Resigns:


అనారోగ్యమే కారణం..


జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ ప్రతినిధి తన్వీర్ సాదిక్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఇందుకు గల కారణాలనూ వివరించారు. అనారోగ్యం కారణంగా ఎక్కువ కాలం పాటు అధ్యక్ష పదవిలో కొనసాగడంపై ఆయన ఆసక్తి చూపడం లేదని, అందుకే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించారని చెప్పారు తన్వీర్ సాదిక్. శ్రీనగర్‌లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంలో ఈ విషయం తెలిపారు. ఫరూక్ రాజీనామాతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించాల్సి ఉంది. అయితే...ఇందుకోసం ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉంది పార్టీ. డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించి, కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటారని తెలుస్తోంది. ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లాకు ఈ అధ్యక్ష పదవిని కట్టబెడతారని అంటున్నారు. ప్రస్తుతానికి ఒమర్ అబ్దుల్లా...పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. త్వరలోనే పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రతినిధి తన్వీర్ సాదిక్ వెల్లడించారు. 


కంటతడి..


అధ్యక్ష పదవికి రాజీనామా చేసే సమయంలో ఫరూక్ అబ్దుల్లా కంట తడి పెట్టుకున్నట్టు సన్నిహితులు చెప్పారు. కార్యకర్తలంతా సమష్టిగా పని చేసి పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లోని ఇంటింటికీ వెళ్లి తమ పార్టీ గురించి చెప్పాలని సూచించారు ఫరూక్. పరిపాలనా యంత్రాంగానికి, సాధారణ పౌరులకు మధ్య వంతెనగా పార్టీ ఉండాలని కోరారు. హక్కుల కోసం పోరాడాల్సిన సమయంలోనూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. ప్రజల్లో ఉంటూ...వారికి అండగా నిలవాలని చెప్పారు. 


మళ్లీ రాష్ట్ర హోదా..? 


జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించనున్నారా..? ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆత్మనిర్భర భారత్‌పై ప్రసంగిస్తున్న సందర్భంలో ఈ సంకేతాలిచ్చారు నిర్మలా సీతారామన్. కేరళలోని తిరువనంతపురంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపారు. అందుకే పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంలో  42% మేర రాష్ట్రాలకు అందజేస్తున్నాం. ప్రస్తుతానికి దీన్ని 41%కి తగ్గించాం. ఇందుకు కారణం...జమ్ము, కశ్మీర్‌ను రాష్ట్రాల జాబితా నుంచి తొలగించడమే. బహుశా భవిష్యత్‌లో ఎప్పుడైనా జమ్ము, కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా వస్తుండొచ్చు" అని వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రాష్ట్రాలకు నిధులు పంచుతున్నట్టు స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను ప్రధాని నరేంద్ర మోదీ మరో ఆలోచన లేకుండా అంగీకరించారని తెలిపారు. త్వరలోనే ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగేలా ఏర్పాట్లు చేయనుంది. 


Also Read: G20 India's Presidency: భారత్‌కు జీ20 అధ్యక్ష పగ్గాలు - మోదీ మార్క్ చూపిస్తారా ! జీ20 ప్రయోజనాలు ఇవే