PM Modi India assumes G20 presidency: ఇండోనేషియాలోని బాలి ఐలాండ్ లో రెండు రోజుల పాటు జరిగిన జీ-20 సదస్సు ముగిసింది. చివరిరోజున ఇండోనేషియా ప్రధాని నుంచి జోకో విడోడో నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది భారత్ లోనే జీ20 సమావేశాలు జరుగుతున్నందున రోస్టర్ ఛైర్ ప్రకారం మోదీ ఏడాది పాటు ప్రెసిడెన్సీ బాధ్యతల్లో ఉంటారు. జీ20లో అమెరికా, రష్యా, చైనా, జపాన్, జర్మనీ లాంటి ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలు ఉన్నాయి. కాబట్టి, ఈ దేశాలన్నింటికీ ఏడాది పాటు మోదీ మాటే శాసనమా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అసలు జీ20 దేశాలు ఏం చేస్తాయి. ఈ అధ్యక్ష బాధ్యతలు ఎలా ఉంటాయో ఆ వివరాలు మీకోసం..


1. జీ 20 అజెండా :
జీ 20లో భారత్, అమెరికా, రష్యా, చైనా సహా 19 దేశాలు ఇంకా యూరోపియన్ యూనియన్ భాగంగా ఉంటాయి. అంతే కాదు వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేట్ ఆర్గనైజేషన్, ఆఫ్రికా యూనియన్ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటాయి. ఈ దేశాలన్నీ కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలి అని ఏడాదికోసారి ఓ అజెండాను రూపొందించుకుంటాయి. ఈ అజెండా ప్రకారం జీ20 నడిపించాల్సిన బాధ్యత అధ్యక్షుడి మీద, ప్రెసిడెన్సీ కంట్రీ మీద ఉంటుంది. తాజాగా జరిగిన సమావేశం చివరిరోజు ప్రధాని మోదీ జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారని తెలిసిందే.


2. జీ 20 ప్రత్యేక అధికారాలు :
G20 కి ప్రత్యేకమైన అధికారాలు ఏం ఉండవు. అంటే వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జీ20 ప్రెసిడెంట్ జోక్యం చేసుకోలేరు. కానీ ఇన్ ఫ్లుయెన్స్ చేయగలరు. అంటే మన ఇండియా కోణం నుంచి చూస్తే ఓ ప్రభావవంతమైన దేశంగా జీ20 కూటమిలో భారత్ ఎదిగేలా ఈ ఏడాది ఉపయోగించుకోవచ్చు. 


3. శాశ్వత సెక్రటేరియట్ భవనం :
జీ 20 కి ప్రత్యేకంగా శాశ్వత సెక్రటేరియట్ భవనం ఎక్కడా లేదు. ట్రోయికా అంటారు. అంటే చివరిగా జీ20 కు ఆతిథ్యం ఇచ్చిన దేశం. ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వబోయే దేశం. వచ్చే ఏడాది ఆతిథ్యం ఇవ్వబోయే దేశం ఇలా ఎప్పటికప్పుడు మూడు దేశాలు కో ఆర్డినేట్ చేసుకుని సమావేశాలను నిర్వహించుకుంటున్నాయి. సో ఈ సారి భారత్ ప్రెసిడెన్సీలోనే ఈ సెక్రటేరియట్ భవనం ఓ కొలిక్కి వచ్చి అది భారత్ లో ఏర్పడితే.. మన దేశానికి అది ఓ ల్యాండ్ మార్క్‌లా మిగిలిపోతుంది. 


4. చీఫ్ G20 కో ఆర్డినేటర్ :
జీ 20 సమావేశాలకు భారత్.. విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్ష వర్థన్ ష్రింగ్లాను నియమించింది. పాలసీ నిర్ణయాలు కానీ, జీ20 సమావేశాలను భారత్ నిర్వహించటంలో అధ్యక్షుడు మోదీకి సహకరిచటంలో చీఫ్ కో ఆర్డినేటర్ పాత్ర కీలకం. 


5. రెండు వేర్వేరు పద్ధతుల్లో జీ 20 :
రెండు వేర్వేరు విధాలుగా జీ20 ప్యారలల్ ట్రాక్స్ లో నడుస్తూ ఉంటుంది. జీ20 దేశాల అధినేతలు సమావేశమయ్యే ప్రధాన సమావేశాలు కాకుండా ఏడాది మొత్తంలో వేర్వేరు సమావేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒకటి ఫైనాన్స్ ట్రాక్, రెండోది షెర్పా ట్రాక్. ఫైనాన్స్ ట్రాక్ లో ఆయా దేశాల ఆర్థికమంత్రులు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు, సెక్రటరీలు సమావేశాలు జరుపుతూ ఉంటారు. షెర్పా ట్రాక్ లో జీ 20 దేశాల దౌత్యవేత్తల మధ్య సమావేశాలు నిర్వహిస్తుంటారు. 



6. G20 షెర్పా :
మంచు పర్వతాలను అధిరోహించేప్పుడు ప్రత్యేకించి ఎవరెస్ట్ ను ఎక్కేప్పుడు అక్కడ ఉండే స్థానిక టిబిటెన్లు సహాయ సహకారాలు అందిస్తారు. వీరినే షెర్పాలు అంటారు. అలానే జీ20 నిర్వహణకు నీతి ఆయోగ్ ను ఆరేళ్లు నడిపించిన అమితాబ్ కాంత్ ను ఇండియా జీ 20 షెర్పా గా కేంద్రం నియమించింది. 


7. మోదీ నాయకత్వం :
జీ 20 కూటమికి అధ్యక్షుడిగా మోదీ నాయకత్వం ఎలా ఉండనుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. యూకేలో రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇలా ప్రతీ దేశం భారత్ తో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్న సమయంలో ఈ ఏడాది మోదీ మేనియా జీ20 మీద ఉండనుందని అంతా భావిస్తున్నారు.


8. వసుధైక కుటుంబం :
విదేశీ వ్యవహారాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నినాదం ఒక్కటే వసుధైక కుటుంబం. ఇదే నినాదాన్ని జీ 20 దేశాలకు చేరువ చేయాలని భారత్ ప్రణాళిక. ఇదే నినాదంతో జీ20 2023 లోగోను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 2023 సెప్టెంబర్ 9-10 రెండు రోజుల పాటు జీ 20 సమావేశాలు న్యూఢిల్లీలో జరగనున్నాయి. 


9. ప్రపంచ ఆర్థిక సంక్షోభం :
ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభం అంచున ఉన్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఎకానమీ సిస్టమ్స్  కొవిడ్ 19 వ్యాప్తి తర్వాత కుప్పకూలాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సహా తూర్పు దేశాల వైపు ప్రపంచ దేశాలు ఆధారపడేలా చేయగలిగితే భారత్ లాంటి దేశాలు బాగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. దీనిపైనా మోదీ దృష్టి సారించే అవకాశం ఉంది.


10. ప్రపంచ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు :
జీ20 కూటమి అధినేతగా నరేంద్ర మోదీ ప్రపంచ ఆర్థిక సంస్థల సంస్కరణలను కోరవచ్చు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ లాంటి సంస్థల నియమ నిబంధనలను జీ20 దేశాల అభివృద్ధి అనుకూలంగా సరళీకృతం చేయటం,  సరికొత్త సంస్కరణలు చేపట్టడం ద్వారా ఆర్థికంగా జీ20 దేశాలకు ప్రత్యేకించి అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ కు మేలు చేకూర్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.