యునెస్కో భారతదేశానికి మరో శుభవార్త అందించింది. రెండు రోజుల క్రితం తెలంగాణలో రామప్ప ఆలయాన్ని ప్రపచం వారసత్వ జాబితాలో చేర్చిన యునెస్కో...తాజాగా గుజరాత్‌లోని ధోలావీరా ప్రాంతాన్ని కూడా ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. ఈ మేరకు ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలావీరాను చేర్చినట్లు యునెస్కో ట్విటర్ వేదికగా వెల్లడించింది.
ధోలావీరా.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉంది. హరప్పా నాగరికత కాలంలో ప్రసిద్ధ పట్టణం ఇది. 5వేల సంవత్సరాల పూర్వం ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన నగర జీవనం ఉండేది. 1967-68లో జేపీ జోషీ నేతృత్వంలోని పురావస్తు శాఖ బృందం ఈ ప్రాంతాన్ని గుర్తించింది. హరప్పా నాగరికతలోని ఎనిమిది ప్రముఖ ప్రాంతాల్లో ఇది ఐదో అతిపెద్దది కావడం విశేషం.
1989 లో భారత పురాతత్వ సర్వే సంస్థ ఆర్.ఎస్.బిష్త్ నేతృత్వంలో తవ్వకాలు మొదలుపెట్టింది. 1990-2005 మధ్య 13 సార్లు తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాల్లో పట్టణ ప్రణాళిక, వాస్తు రీతులు, వెలుగులోకి వచ్చాయి. అనేక ముద్రలు, పూసలు, జంతువుల ఎముకలు, బంగారం, వెండి, మట్టి ఆభరణాలు, మట్టి కుండలు, కంచు పాత్రలు లభించాయి. పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ధోలావీరా దక్షిణ గుజరాత్, సింధ్, పంజాబు, పశ్చిమాసియాల్లోని జనావాసాల మధ్య ప్రధాన వర్తక కేంద్రంగా ఉండేది.
లోథాల్ కంటే పురాతనమైనది ధోలావీరా. ఇది చతుర్భుజాకారంలో 771.1 మీ. పొడవు, 616.85 మీ. వెడల్పూ కలిగి, 48 హెక్టార్లలో విస్తరించి ఉంది. హరప్పా, మొహెంజో దారోల్లాగా కాకుండా, ఈ పట్టణాన్ని ఒక జ్యామితి ప్రకారం నిర్మించారు. దీనిలో మూడు విభాగాలున్నాయి – ఒక కోట, మధ్య పట్టణం, దిగువ పట్టణం. కోట, మధ్య పట్టణం రెంటికీ రక్షణ నిర్మాణాలు, ద్వారాలు, వీధులు, బావులు, విశాలమైన బహిరంగ స్థలాలూ ఉన్నాయి. పట్టణపు నైఋతి భాగం దాదాపు అంతటా విస్తరించి ఉన్న కోట, పటిష్ఠంగా నిర్మితమై ఉంది. కోటకు జమిలి బురుజుల ద్వారా రక్షణ కల్పించారు. దీనికి పక్కనే ముఖ్యమైన అధికారులు నివసించే బెయిలీ అనే ప్రాంతం ఉంది. గోడలకు ఆవల, మరొక ఆవాస స్థలం కూడా దొరికింది. ధోలావీరాలో కొట్ట్టొచ్చినట్లు కనిపించే విశేషమేమిటంటే ఇక్కడి నిర్మాణాలన్నీ రాతితో కట్టినవే కావడం. మిగతా అన్ని సింధు లోయ స్థలాలు దాదాపు అన్నిటిలోనూ - హరప్పా, మొహెంజో దారోలతో సహా - నిర్మాణాలన్నీ ఇటుకలతో కట్టారు.
రంగు వేసిన మట్టి కుండలు, చతురస్రపు ముద్రికలు, సింధులిపి లేని ముద్రికలు, 3 మీ. పొడవైన సైన్‌బోర్డులు ధోలావీరాలో లభించాయి. రాతిలో చేసిన కూర్చున్న భంగిమలో ఉన్న ఒక పురుషుని ప్రతిమ కూడా ఇక్కడ దొరికింది. పెద్ద జాడీలు, పెద్ద కంచు సుత్తి, శానం , కంచు అద్దం, బంగారు తీగ, బంగారు చెవిపోగు, రంధ్రం కలిగిన బంగారు గోళీలు, రాగి గాజులు, లింగాకృతిలో ఉన్న రాళ్ళు, సింధు లిపిలో ఉన్న చతురస్రపు ముద్రికలు, ఓ గుండ్రటి ముద్రిక, మూపురం కలిగిన జంతువులు, రంగులద్దిన మట్టి పాత్రలు, సూక్ష్మ రంధ్రాలు కలిగిన జాడీలు, మట్టి గ్లాసులు, శిల్పాకృతులు, ఆకురాళ్ళు, మోర్టార్లు ఈ స్థలంలో దొరికాయి. వివిధ పరిమాణాల తూనికరాళ్ళు కూడా దొరికాయి.
ధోలావీరాకు వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కిన విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ధోలావీరా ఇప్పుడు భారత్ లో 40వ వారసత్వ సంపదగా నిలుస్తుందన్నారు. వరల్డ్ హెరిటేజ్ సైట్లలో ఇండియా సూపర్-40 క్లబ్‌లో చేరిందని మంత్రి వెల్లడించారు.
2014 నుంచి భారత్‌లో కొత్తగా పది ప్రపంచ వారసత్వ సంపదలుగా జాబితాలో చేరాయని, ఇది మొత్తం సైట్లలో నాలుగవ వంతు అని, ప్రధాని మోదీ కమిట్‌మెంట్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, జీవన విధానాన్ని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్న తీరు ఆయన దీక్షను చాటుతుందని మంత్రి తెలిపారు.
ఇప్పటికే తెలంగాణలో రామప్ప ఆలయాన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో ప్రకటించిన విషయం తెలిసిందే.
యునెస్కో 1978 నుంచి ఇప్పటివర కు 1,127 కట్టడాలు, ప్రాంతాలకు వారసత్వ హోదా కల్పించింది. వీటిలో మూడు కట్టడాల నిర్వహణ యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని ఆ జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం 167 దేశాల కు చెందిన 1,124 కట్టడాలు వారసత్వ జాబితాలో ఉన్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన అత్యధిక కట్టడాలున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉంది. అత్యధికంగా ఇటలీ నుంచి 57 కట్టడాలు యునెస్కో గుర్తిం పు పొందాయి. ఆ తర్వాతి స్థానంలో చైనా 55, జర్మనీ 48, స్పెయిన్ 48, ఫ్రాన్స్ 47 ఉన్నాయి.మన దేశంలో రామప్పతో కలిపి 39 కి చేరితే ఇప్పుడు గుజరాత్ ధోలావీరాతో కలపి ఆ సంఖ్య 40కి పెరిగింది. మొదటిసారిగా 1983లో అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్‌మహల్‌కు వారసత్వ హోదా లభించింది. ఆ తర్వాత వీటి సంఖ్య క్రమంగా పెరిగింది. ఎలిఫెంటా గుహలు, ఛత్రపతి శివాజీ టెర్మినల్, కోణార్క్ సూర్యదేవాలం, తంజావూర్ లో చోళ రాజులు నిర్మించిన బృహదీశ్వర ఆలయం, రాజస్థాన్ లోని హిల్ ఫోర్ట్స్, ఫతేపూర్ సిక్రీ ఇలా మొత్తం మనదేశంలో మొత్తం 40 కట్టడాలకు వారసత్వ హోదా దక్కింది.