కరోనా సమయంలో ప్రాణాలకు  తెగించి సేవలు అందించిన వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కనీసం వారికి అత్యున్నతమైన అవార్డులు అయినా ఇవ్వాలని  తాపత్రయ పడుతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.  ఇటీవల ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. దాని ప్రకారం.. పద్మ అవార్డులను.. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మాములుగా అయితే భారతరత్ననే ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ఒక్కరికే ఇవ్వాలన్న రూల్ లేదని..  అందరికీ కలిపి ప్రకటించాలన్నారు. అలా అయితేనే వారికి సముచిత గౌరవం ఇచ్చినట్లుగా ఉంటుందన్నారు.  అయితే.. ఇప్పుడు పద్మ అవార్డులను వారిని ఎంపిక చేస్తే బాగుంటుందనుకుని.. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రజలనూ భాగస్వాములను చేయాలని నిర్ణయించుకున్నారు. 


గణతంత్ర దినోత్సవం 2022 సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ఠ నైపుణ్యం, ప్రతిభ చూపినవారికి  కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ అవార్డులు ఇచ్చేందుకు  దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానించింది. దీంతో కేజ్రీవాల్.. విశిష్ఠ వైద్యసేవలందించిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల పేర్లను పద్మ అవార్డుల కోసం ప్రతిపాదించాలని నిర్ణయించారు.  కరోనా విపత్తు సమయంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు అందించిన సేవలకు గుర్తింపుగా వారి పేర్లను సూచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.   ఆగస్టు 15వతేదీ వరకు ప్రజల నుంచి పద్మ అవార్డులకు ప్రతిపాదనలు ఆహ్వానించి, వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి తుది జాబితాను రూపొందించి వాటిని కేంద్రానికి పంపిస్తారు. సెప్టెంబరు 15వతేదీ వరకు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపిస్తారు. ఆ తర్వాత నిర్ణయం కేంద్రం తీసుకుంటుంది  . ఇందు కోసం ఎంపిక కమిటీని కేంద్రం నియమిస్తుంది. వారు అవార్డులను ఎంపిక చేస్తారు. సాధారణంగానే ఈ సారి పద్మ అవార్డుల్లో ప్రధానంగా కరోనా సేవలు అందించిన వారికే పాధాన్యత  ఇస్తారన్న చర్చ జరుగుతోంది.  



దేశంలో ప్రజలందరూ... ఫ్రంట్ లైన్ వారియర్స్ పట్ల కృతజ్ఞతగా ఉన్నారు. వారికి సరైన గుర్తింపు రావాల్సిందేనని కోరుకుంటున్నారు.  అయితే.. వారికి ప్రత్యేకమైన అవార్డులు ఇవ్వాలా.. లేకపోతే.. మరో విధమైన గుర్తింపునివ్వాలా అన్నదానిపై ఏకాభిప్రాయం లేదు. అనూహ్యంగా కేజ్రీవాల్ మాత్రం... భారతరత్న.. పద్మ అవార్డులు వంటివాటిని తెరపైకి తెచ్చారు. అయితే  అన్ని రాష్ట్రాల్లోనూ లక్షల మంది ఫ్రంట్ లైవ్ వారియర్స్ సేవలు అందించారు. ఎవరో కొంత మందికి వారి ప్రతినిధులుగా గుర్తించి అవార్డులిస్తే.. మిగతా వారికి గుర్తిపు లభించదు. అందుకే కేజ్రీవాల్.. మెత్తంగా వైద్య వ్యవస్థనే భారతరత్నగా ప్రకటించాలని సూచిస్తున్నారు.  కేజ్రీవాల్ సూచనలను కేంద్రం ఎంత మేర పరిగణనలోకి తీసుకుంటుందో వేచి చూడాలి.