ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ నుంచి త్వరలో ల్యాప్‌టాప్ రానుంది. రెడ్‌మీ బుక్ (Redmi Book) పేరున్న ఈ ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 3వ తేదీన భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను రెడ్‌మీ నోట్ 10టీ (Redmi Note 10T) స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ విడుదల చేయగా.. తాజాగా ల్యాప్‌టాప్ లాంచ్ డేట్‌ను వెల్లడించింది. మనదేశంలో రెడ్‌మీ నుంచి విడుదల కానున్న మొదటి ల్యాప్‌టాప్ ఇదే కానుంది. రెడ్‌మీ బుక్ ల్యాప్‌టాప్.. రియల్‌మీ లాంచ్ చేయబోయే ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఎంఐ నోట్ బుక్స్ పేరుతో షియోమీ గతేడాది ల్యాప్‌టాప్ సెగ్మెంట్లలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. తాజాగా రెడ్‌మీ బుక్ శ్రేణి కూడా భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టనుంది. చైనాలో షియోమీ ఇప్పటికే రెడ్‌మీ బుక్, రెడ్‌మీ బుక్ ఎయిర్ & రెడ్‌మీ బుక్ ప్రో మోడల్స్‌ను విడుదల చేసింది.
ఇయర్ బడ్స్, స్మార్ట్ బ్యాండ్స్..
గతేడాది, రెడ్‌మీ ఫోన్ ప్లస్ స్ట్రాటజీతో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకుందని కంపెనీ తెలిపింది. పవర్ బ్యాంకులు, ఇయర్ బడ్స్, స్మార్ట్ బ్యాండ్స్ వంటి ఉత్పత్తులను ప్రారంభించామని గుర్తు చేసింది. ఈ ఏడాది, మరో ముందడుగు వేసి స్మార్ట్ టీవీ విభాగంలోకి కూడా ప్రవేశించామని పేర్కొంది. ఇప్పుడు, అతి త్వరలోనే రెడ్‌మీ బుక్ ను తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది.
డిస్ ప్లే చుట్టూ పైన, కింది భాగాలలో మందపాటి బెజెల్స్‌తో కూడిన క్లాసిక్ డిజైన్‌ను టీజర్ పోస్టర్ లో చూపించింది. చైనాలో ఇప్పటికే రెడ్‌మీ బుక్ మోడల్స్ చాలానే విడుదల కాగా.. వీటిలో ఏ మోడల్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు.
చైనాలో మొట్టమొదటి రెడ్‌మీ బుక్ సిరీస్ ను 2019లో రిలీజ్ చేసింది. ఆ తర్వాత చాలా మోడల్స్‌ను విడుదల చేసింది. ఇటీవల రిలీజ్ అయిన వాటిలో రెడ్‌మీ బుక్ ప్రో 14 మరియు రెడ్‌మీ బుక్ ప్రో 15 ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. వీటిలో ఏఎండీ రైజెన్ తో పాటు ఇంటెల్ కోర్ ప్రాసెసర్ 11వ వెర్షన్లను ఉపయోగించింది.
రెడ్‌మీ బుక్ ల్యాప్‌టాప్స్‌తో పాటు ఎంఐ నోట్ బుక్ సిరీస్ లను దేశంలో ఇంకా పెంచాలని షియోమీ భావిస్తోంది. ఎంఐ నోట్ బుక్ ప్రో 14, ఎంఐ నోట్ బుక్ అల్ట్రా 15.6 ల్యాప్ టాప్ లను భారతదేశంలోకి తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి షియోమీ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.