గౌరవప్రదమైన వస్త్రధారణ అంటే మన దేశంలో మొట్ట మొదటగా ఏం చెబుతారు ?. పురుషులకైతే ప్యాంట్ , షర్ట్, మహిళలకైతే నిర్మోహమాటంగా చీర అనే చెబుతారు. చీర అనేది భారతీయ మహిళలకే సొంతమైన సంప్రదాయమైన వస్త్రధారణ. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. చీరకట్టుకుంటే తమ హోటళ్లలోకి రానివ్వబోమని నిర్మోహమాటంగా చెబుతున్నారు. ఇలా చెప్పిన ఓ రెస్టారెంట్ కథ ఇప్పుడు కంచికి చేరుతోంది.






ఢి‌ల్లీలో అక్విలా అనే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ కొన్ని పద్దతుల్ని పెట్టుకుంది. అంటే సంప్రదాయమైన వస్త్రధారణ ఉన్న వారినే అనుమతిస్తారన్నమాట. అంత వరకూ బాగానే ఉంది. కానీ వారి సంప్రదాయమైన వస్త్రధారణ జాబితాలో చీర లేదు. అదే ఇప్పుడు వివాదానికి కారణం అయింది. ఓ యువతి అక్విల్ హోటల్ ఎంట్రన్స్‌లో హోటల్ సిబ్బందిని చీర కట్టుతో ఉన్న వారిని ఎందుకు అనుమతించడం లేదు అని ప్రశ్నించింది. దానికి ఆ ఉద్యోగి "చీర స్మార్ట్ క్యాజువల్స్‌గా పరిగణించబడదు" అని సమాధానం చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.  


Also Read: Covaxin for kids: చిన్నారులకు కొవాగ్జిన్ టీకా.. శుభవార్త చెప్పిన భారత్ బయోటెక్


ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన యువతి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన చీర ఇప్పుడు సంప్రదాయ దుస్తుల జాబితాలో లేదని .. అసలు సంప్రదాయ దుస్తులు అంటే ఏమిటని ఆమె ప్రశ్నించింది. ఆ సంప్రదాయ దుస్తులు.. గౌరవనీయమైన దుస్తులు ఏమిటో చెబితే తాను చీర కట్టుకోవడం మానేస్తానని ఆమె తన ట్వీట్‌లో ప్రకటించారు. అనితా చౌదరి అనే ఆ మహిళ ట్వీట్ వైరల్ అయిపోయింది. అనేక మంది ఇది భారతీయ, సంస్కృతి సంప్రదాయాలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నారు. రెస్టారెంట్‌పై విరుచుకుపడుతున్నారు. [tw]



 


హోటల్‌లో ఎలాంటి డ్రెస్‌కోడ్‌తో రావాలనేది వారి ఇష్టం అని అయితే చీర కట్టును అనుమతించకపోవడం దారుణం అన్న అభిప్రాయాలు నెటిజన్లలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మంచి రెస్టారెంట్‌గా పేరున్న అక్విలాకు ఇప్పుడు రేటింగ్‌లు పూర్తిగా తగ్గిపోయాయి. గూగుల్‌లో ఒకటిన్నర శాతం.. జొమాటో రెండు శాతం మాత్రమేఉంటున్నాయి. సమీక్షల్లో అందరూ నెగెటివ్‌గా రాస్తున్నారు. తప్పు ఎక్కడ జరిగిందో కానీ ఆ రెస్టారెంట్ మాత్రం చీర దెబ్బకు కుదేలైపోతోంది.