Delhi Floods: మొన్నటి వరకూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ఢిల్లీని ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం వచ్చిందని అనుకునే లోగా వరదలు ఇబ్బంది పెడుతున్నాయి. పలు చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. అటు రాజకీయ నాయకులకూ ఈ ఇబ్బందులు తప్పలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున పలువురు మంత్రులు, ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. వాళ్లూ ఈ వరద బారిన పడ్డారు. కొంత మంది ఎంపీల ఇళ్లూ నీట మునిగిపోయాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ఓ వీడియో పోస్ట్ చేశారు. తన ఇల్లంతా నీట మునిగిపోయిందని వెల్లడించారు. ఇంట్లో ఫర్నిచర్‌ పూర్తిగా పాడైపోయిందని అన్నారు. 


"నిద్ర లేచే సరికి ఇల్లంతా నీటి మునిగిపోయింది. అన్ని గదుల్లోనూ ఇదే పరిస్థితి. ఫర్నిచర్, కార్పెట్‌లు పూర్తిగా పాడైపోయాయి. చుట్టు పక్కల ప్రాంతాలన్నీ ఇదే విధంగా నీట మునిగిపోయాయి. ఈ నీళ్లను ఎక్కడికి తొలగించాలో కూడా తెలియకుండా ఉంది. కరెంట్ షాక్ తగలకూడదన్న ఉద్దేశంతో ఉదయం నుంచి పవర్ కట్ చేశారు"


- శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ






ఏదో విధంగా నీళ్లన్నీ బయటకు పంపి పార్లమెంట్‌కి చేరుకున్నానని శశిథరూర్ వివరించారు. ఇక మరో ఎంపీ కూడా ఇదే విధంగా కష్టాలు పడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్‌ ఉన్న లోధి ఎస్టేట్ పూర్తిగా నీట మునిగింది. కార్‌ వరకూ వెళ్లేందుకూ వీల్లేకుండా పోయింది. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉండగా ఆయన వ్యక్తిగత సిబ్బంది భుజాలపై మోసుకుని వచ్చి కార్ వరకూ దిగబెట్టారు. ఈ వీడియో వైరల్ అయింది.





ఈ మధ్యే ఇంటికి ఫ్లోరింగ్ చేయించామని, వరదల కారణంగా లక్షల రూపాయల నష్టం వచ్చిందని చెప్పారు రామ్ గోపాల్ యాదవ్. అటు ఢిల్లీ మంత్రి అతిషి ఇల్లు కూడా మునిగిపోయింది. నీటి సంక్షోభంపై ఈ మధ్యే ఆమె పోరాటం చేశారు. ఇంతలో ఉన్నట్టుండి ఇలా వరదలు ముంచెత్తాయి. 


Also Read: Kangana Ranaut: ఎంపీగా తొలిసారి సభలో అడుగు పెట్టిన కంగనా, ప్రతిపక్ష ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు