NEET Issue: ఎంపీగా తొలిసారి లోక్‌సభలో అడుగు పెట్టిన కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఎంపీలు తనపై దాడి చేస్తారేమో అన్న స్థాయిలో ప్రవర్తించారని అన్నారు. అందరూ గట్టిగా అరిచారని, ఫలితంగా చాలా అసహనానికి లోనయ్యాయని వెల్లడించారు. రోడ్లకి,సభకి తేడా లేకుండా ప్రతిపక్ష ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని మండి పడ్డారు. వాళ్లు దాడి చేయాలని ప్రిపేర్ అయ్యే వచ్చుంటారని విమర్శించారు. ఎవరినీ మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని తేల్చి చెప్పారు. 


"తొలిసారి పార్లమెంట్‌ సమావేశాలు జరిగాయి. కానీ ప్రతిపక్షాలు ఏ మాత్రం హుందాతనం లేకుండా ప్రవర్తించాయి. కొందరు ఎంపీలు సభా మర్యాద పాటించలేదు. గట్టిగా కేకలు పెట్టారు. ఎవరినీ మాట్లాడనివ్వలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఇవ్వాల్సింది పోయి ఇలా నానా రభస చేశారు. రోడ్డుపైన అరిచినట్టుగా సభలోనూ గట్టిగా అరిచారు. ఇలాంటి వాటిని ఏ మాత్రం సహించకూడదు"


- కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ






పార్లమెంట్‌ని కుదిపేసిన నీట్ వివాదం..


పార్లమెంట్‌లో నీట్ వ్యవహారంపై దుమారం రేగింది. తక్షణమే చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. చాలా సేపటి వరకూ పట్టుబట్టడం వల్ల గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీ సభా వేదికగా ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. విద్యార్థుల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.  


Also Read: NEET Issue: సభలో నీట్‌పై మాట్లాడుతుండగా రాహుల్ మైక్ కట్ - కాంగ్రెస్ సంచలన ఆరోపణలు