NEET Controversy 2024: పార్లమెంట్‌లో నీట్ వ్యవహారంపై పెద్ద ఎత్తున రగడ జరిగింది. తక్షణమే చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడం వల్ల గందరగోళం నెలకొంది. ఫలితంగా లోక్‌సభ సోమవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. నీట్ వివాదంపై తాను మాట్లాడుతుండగా మైక్ ఆఫ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. మైక్రోఫోన్‌కి యాక్సెస్ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాని రిక్వెస్ట్ చేశారు. నీట్ వివాదంపై చర్చ జరగాల్సిందే అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరపున ఓ ప్రకటన ఇవ్వాలని అన్నారు. ఈ సమయంలోనే రాహుల్‌ మైక్రోఫోన్‌ పని చేయలేదు. దీనిపైనే కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. గతంలోనూ రాహుల్ గాంధీ అదానీ వ్యవహారంపై మాట్లాడినప్పుడు ఇలాగే జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు మరోసారి ఇదే రిపీట్ అయింది. అయితే...ఈ ఆరోపణల్ని స్పీకర్ ఓం బిర్లా కొట్టిపారేశారు. ఎంపీల మైక్‌లు ఆఫ్ చేయలేదని, అసలు ఆ కంట్రోల్ తన వద్ద ఉండదని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం గురించి మాత్రమే చర్చ జరగాలని, మిగతా వ్యవహారాలు రికార్డు అవ్వవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాత్రం మోదీ సర్కార్‌పై మండి పడుతోంది. 


"నీట్‌ వివాదంపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదు. రాహుల్ గాంధీ దేశ యువత తరపున సభలో ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అంత కీలకమైన విషయం మాట్లాడుతుంటే ఆయన గొంతుని అణిచివేయాలని చూస్తున్నారు. మైక్రోఫోన్ ఆఫ్ చేస్తున్నారు. ఇంత కన్నా దారుణం ఇంకేముంటుంది"


- కాంగ్రెస్ 






NEET-UG 2024 ఎగ్జామ్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పేపర్ లీక్‌తో విద్యార్థులు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. మళ్లీ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలైతే ఏకంగా నీట్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థుల విశ్వాసాన్ని కోల్పోయిందని తేల్చి చెబుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. నీట్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా నీట్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. అటు కేంద్ర ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీ వేసి ఈ వ్యవహారంపై విచారణ జరుపుతోంది. నిందితులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని ప్రకటించింది. 


Also Read: US Presidential Debate: ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ