Biden Trump Debate: మరి కొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రెసిడెంట్ రేసులో బైడెన్, ట్రంప్ ఉండడం ఉత్కంఠ పెంచుతోంది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ఓ డిబేట్‌లో పాల్గొన్నారు. ఆర్థిక వ్యవస్థ నుంచి అంతర్జాతీయ సంక్షోభాల వరకూ అన్ని అంశాలపైనా ఇద్దరూ వాదనలు వినిపించారు. కనీసం షేక్‌హ్యాండ్ కూడా ఇచ్చుకోకుండా ఎవరి పోడియం వద్దకు వాళ్లు వెళ్లి ప్రసంగించారు. ఆర్థికంగా అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ట్రంప్ చర్చించారు. విదేశాంగ విధానాల గురించీ ప్రస్తావించారు. వలసల సమస్యపైనా ట్రంప్‌ చాలా గట్టిగా మాట్లాడారు. అమెరికాలోని అన్ని నెట్‌వర్క్ ఛానల్స్‌లోనూ ఈ డిబేట్‌ని ప్రసారం చేశారు. దాదాపు 90 నిముషాల పాటు ఇది కొనసాగింది. 


ఎవరేం వాదించారంటే..?


అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ముందుగా బైడెన్ ప్రస్తావించారు. ట్రంప్ హయాంలో ఎకానమీ ఎంత దారుణంగా ఉందో వివరించే ప్రయత్నం చేశారు. "ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయేంత వరకూ ట్రంప్‌ చూస్తూ కూర్చున్నారు" అంటూ తీవ్రంగా మండి పడ్డారు. అంతే కాదు. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలోనూ ట్రంప్‌ సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయిందని విమర్శించారు. తాను వచ్చిన తరవాతనే దేశం మళ్లీ సాధారణ స్థితికి వచ్చిందని అన్నారు. ట్రంప్ హయాంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయాన్ని బైడెన్ ప్రస్తావించారు. అటు విదేశాంగ విధానంపైనా ఇద్దరి మధ్యా గట్టి వాదనే జరిగింది. ఎకానమీ గురించి మాట్లాడుతుండగానే ట్రంప్‌ ఫారిన్ పాలసీ అంశాన్ని ప్రస్తావించారు. అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలోనే అదో చీకటి అధ్యాయం అని మండిపడ్డారు. అయితే...బైడెన్ ఇందుకు గట్టిగానే సమాధానమిచ్చారు. అఫ్గనిస్థాన్‌లో వేలాది మంది ప్రాణాలు పోతున్నా ట్రంప్ ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. 


వలసల సమస్యపైనా ఇద్దరూ వాదించుకున్నారు. వలసల గురించి ట్రంప్‌ అనవసరంగా లేనిపోనివన్నీ చెప్పి అందరినీ ఆందోళనకు గురి చేశారని బైడెన్ ఆరోపించారు. అక్రమ వలసదారుల్ని అమెరికాలోకి ఆహ్వానిస్తున్నారంటూ ట్రంప్ చేసిన ఆరోపణల్ని కొట్టి పారేశారు. అందుకు సంబంధించి డేటాయే లేదని తేల్చి చెప్పారు. దక్షిణ అమెరికాలోని సరిహద్దు ప్రాంతాన్ని రక్షించడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్‌ విమర్శించారు. నేరస్థులను దేశంలోకి రానిస్తున్నారని అన్నారు. Abortion Rights పైనా వాడివేడి వాదన జరిగింది.  ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు డిబేట్‌ కాస్తంత హీటెక్కింది. అబార్షన్స్‌ బ్యాన్‌ని ట్రంప్ సమర్థించడాన్ని బైడెన్ వ్యతిరేకించారు. అటు ట్రంప్ మాత్రం అబార్షన్‌ మెడికేషన్‌ని అందుబాటులో ఉంచడం వల్ల అత్యాచారాలు తగ్గుతాయని సమర్థించుకున్నారు. అయితే..ఇటీవల ట్రంప్‌ ఓ కేసులో ఇరుక్కోవడం, ఆయన దోషి అని కోర్టు స్పష్టం చేయడం లాంటి పరిణామాలు అమెరికా రాజకీయాలను మలుపు తిప్పాయి. దోషిగా తేలినప్పటికీ ట్రంప్‌ ఎన్నికల్లో పోటీ చేసే వీలుంటుంది. ఈ ప్రభావం ఫలితాలపై పడుతుందా లేదా అన్నదే ఉత్కంఠగా మారింది. అటు బైడెన్‌కి వయసైపోయిందంటూ ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ట్రంప్‌కే అవకాశమివ్వాలని కోరుతున్నారు. 


Also Read: NEET Controversy: నీట్‌ని రద్దు చేయాల్సిందే, తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం