Jawahar Reddy And Poonam Malakondaiah: వెయింట్‌లో ఉన్న మరో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయంలో సీఎస్‌గా ఉంటూ అనేక అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న జవహర్‌ రెడ్డి, మరో అధికారి పూనంమాలకొండయ్యకు రిటైర్‌మెంట్‌ ముందు రోజు పోస్టింగ్ ఇచ్చింది. 


కేఎస్ జవహర్ రెడ్డి... వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టి నాటి నుంచి వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్నికల నాటికి ఆ ఆరోపణలు మరింత ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా ఆ టైంలో పింఛన్ల పంపిణీపై రేగిన దుమారానికి జవహర్ రెడ్డే ప్రధాన కారణంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపించాయి. 


పింఛన్లు పంపిణీ విషయంలోనే కాదు కీలక నిర్ణయాల్లో కూడా అడ్డగోలుగా వ్యవహరించారనే అపప్రధ మూటకట్టుకున్నారు. ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైర్‌మెంట్‌ వరకు పోస్టింగ్ ఇవ్వకుండా వేడుక చూశారని ఆరోపణలు ఉన్నాయి. చివరకు ఆయన కోర్టులకు వెళ్లి న్యాయ పోరాటం చేసి ఆయన తన హక్కులను సాధించుకున్నారని అంటారు. 


ఇన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వానికి అంటకాగారని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం రాక ముందే జవహర్‌రెడ్డిని పక్కన పెట్టింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఇంతలో నీరబ్‌ కుమార్‌ను సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇన్ని రోజులు వెయిటింగ్‌లో ఉన్న జవహర్‌ రెడ్డికి గురువారం అర్థరాత్రి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. 


సాధారణంగా గత ప్రభుత్వ హయాంలో తమకు వ్యతిరేకంగా పని చేశారని ఆరోపణలు ఉన్న అధికారులను ప్రధాన్యం లేని పోస్టుల్లో వేస్తుంటారు. ముఖ్యంగా ప్రెస్‌ అండ్ ప్రిటింగ్ విభాగం వారికి కనిపించే మొదటి ఆప్షన్. అయితే జవహర్‌ రెడ్డికి మాత్రం ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. వెంటనే ఆయన జాయిన్ అవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. 


ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రటరీగా అనంత రాము ఉన్నారు. ఆయన్ని వెంటనే రిలీవ్ కావాలని నీరబ్ కుమార్ ఆదేశించారు సీఎస్‌గా ఉన్న వ్యక్తిని అదనపు సెక్రటరీగా నియమించడం కాస్త ఇబ్బందిగా ఉన్న గత ప్రభుత్వాల మాదిరిగా అవమానించలేదనే టాక్ వినిపిస్తోంది. జవహర్‌ రెడ్డి జూన్ 30న పదవీ విరమణ చేయనున్నారు. దీని ఒక రోజు ముందే ఆయనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. 


జవహర్‌రెడ్డితోపాటు మరో అధికారికి కూడా ప్రభుత్వం రిటైర్మెంట్ ముందే పోస్టింగ్ ఇచ్చింది. ఐఏఎస్‌ అధికారుల బదిలీల టైంలో జీఏడీలో రిపోర్ట్ చేసిన పూనం మాలకొండయ్యకు ఈసారి పోస్టింగ్ వచ్చింది. ఆమె కూడా జూన్ 30 పదవీ విరమణ చేయనున్నారు. ఆమెను జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలో ఉన్న పోలా భాస్కర్‌ స్థానంలో ఈమెను నియమించారు. భాస్కర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. పూనం మాలకొండయ్య కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేసి ఆరోపణలు ఎదుర్కొన్నారు. జూన్ 30 ఆదివారం కావడంతో  వీళ్లిద్దరు ఒక రోజు ముందు అంటే జూన్ 29 శనివారం నాడే ఆఖరి వర్కింగ్‌డేగా గుర్తిస్తారు. కాబట్టి వీళ్లకు రిటైర్మెంట్‌కు ఒకరోజు ముందే పోస్టింగ్ వచ్చినట్టు అయింది. 


కేంద్ర సర్వీస్‌ నుంచి ఏపీకి వచ్చిన పీయూష్‌ కుమార్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఆయన్ని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించింది. పీఎఫ్‌ఎస్‌ ముఖ్య కార్యదర్శి అదనపు బాధ్యతలు కూడా కట్టబెట్టారు. ప్రస్తుతం ఆ బాధ్యతలో ఉన్న ఎస్‌ ఎస్‌ రావత్‌ను తప్పించారు. ఆయన ప్రస్తుతం సెలవులో ఉన్నారు.