Thotakura Garelu Recipe : చాలామంది పిల్లలు తోటకూర తినేందుకు ఇష్టపడరు. తల్లులకేమో దానిని ఎలా అయినా వారికి పెట్టాలని.. వారికి పోషకాలు అందుతాయని చూస్తారు. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే తోటకూరతో గారెలు చేసేయండి. ఈ రెసిపీ మంచి రుచిని అందిచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అసలు తోటకూరతో గారెలు ఏంటి? వీటిని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అయితే అస్సలు కంగారు పడకండి. దీనిని చేయడం చాలా సులభం. ఎలా వండాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


మినపప్పు - 1 కప్పు


అల్లం - 2 అంగుళాలు


పచ్చిమిర్చి - 5


ఉప్పు - రుచికి తగినంత


జీలకర్ర - 1 స్పూన్


నీరు - గ్రైడింగ్ చేసుకోవడానికి తగినంత


తోటకూర - 3 కప్పులు


నూనె - డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడేంత


తయారీ విధానం 


ముందుగా మినపప్పు ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి. లేదంటే మీరు ఈ గారెలు చేసుకోవాలనుకునే 4 లేదా 5 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మినపప్పును కడిగి మిక్సీ జార్​లో వేసుకోవాలి. ఇప్పుడు అల్లంపై ఉన్న పొట్టు తీసి కడిగి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కడిగి మధ్యలోకి కోసుకోవాలి. వీటిని మిక్సీ జార్​లో వేసుకోవాలి. జీలకర్ర, ఉప్పు కూడా వేసుకుని.. పిండిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా.. గట్టిగా కాకుండా పిండిని రుబ్బుకోవాలి.


నూనె పీల్చుకోకుండా ప్రో టిప్ 


పిండిని మిక్సీ చేసేందుకు కాస్త నీరు ఉపయోగించవచ్చు. కానీ ఎక్కువ నీరు వేయకూడదు. అలా చేస్తే గారెలు ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. అలా అని గట్టిగా పిండి ఉంటే లోపల సరిగ్గా ఉడకకపోవచ్చు. కాబట్టి గారెలు బాగా రావాలంటే సరైన మోతాదులో నీరు వేసుకుని.. పిండిని రుబ్బుకోవడం చాలా ముఖ్యం. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని.. మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిలో ముందుగా శుభ్రం చేసి.. ముక్కలుగా కోసి కడిగి పెట్టుకున్న తోటకూర వేయాలి. ఆకు కూరలో నీరు లేకుండా చూసుకోవాలి. లేదంటే గారెల పిండి వదులు అయిపోతుంది. 


గారెలు ఇలా ఈజీగా వేయొచ్చు..


తోటకూర వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి సరి చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్​ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకోవాలి. దానిలో డీప్​ ఫ్రై చేయడానికి సరిపడేంత నూనెను వేసుకోవాలి. అది వేడైన తర్వాత.. సిద్ధం చేసుకున్న గారెల పిండిని మరోసారి కలపాలి. ఇప్పుడు ఓ గిన్నెలో నీటిని తీసుకుని.. దానిని అద్దుకుంటూ గారెల పిండిని ముద్దగా తీసుకుని.. గారెలుగా ఒత్తుకుని నూనెలో వేయాలి. ఇదే తరహాలో పిండి మొత్తాన్ని గారెలుగా వేసుకోవాలి. అంతే వేడి వేడి, హెల్తీ బ్రేక్​ఫాస్ట్ రెడీ. 



పిల్లలకు ఇలా పెడితే..


తోటకూరతో చేసిన ఈ గారెలు మంచి రుచిని అందించడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పిల్లలు తోటకూర తినట్లేదు.. కానీ ఈ ఆకుకూరను వారికి ఎలా అయినా డైట్​లో చేర్చాలి అనుకుంటే ఈ గారెలు బెస్ట్ ఆప్షన్. వీటివల్ల వారికి మంచి పోషకాలు అందుతాయి. గారెలకు కాంబినేషన్​గా అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీ మంచి కాంబినేషన్ అవుతుంది. పెరుగులో వేసి ఆవడ కూడా పెట్టొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా వెంటనే ఈ తోటకూర గారెలు ట్రై చేసి.. మీ టేస్ట్, హెల్త్​ని మరింత రెట్టింపు చేసుకోండి.


Also Read : టేస్టీ పెప్పర్ రైస్ తయారు చేయడం చాలా సులభం.. లంచ్​కి పర్​ఫెక్ట్​ రెసిపీ ఇది