Easy Lunch Box Recipe Pepper Rice : అన్నం మిగిలిపోతూ ఉంటే దానిని పెరుగు వేసుకుని తినడమో.. లేదంటే పులిహోర, ఫ్రైడ్ రైస్ లాంటివో చేసుకుంటారు. లంచ్​బాక్స్ తీసుకువెళ్లేందుకు బ్యాచిలర్స్​కు కర్రీలలో ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. అలాంటివారు టేస్టీ, స్పైసీ పెప్పర్ రైస్​ను తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. అంతేకాకుండా మంచి రుచిని అందిస్తుంది. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. 


కావాల్సిన పదార్థాలు


బియ్యం - రెండు కప్పులు


నూనె - రెండు టేబుల్ స్పూన్స్


నెయ్యి - రెండు టీస్పూన్లు


ఎండు మిర్చి - 2 


మిరియాలు - 1 స్పూన్


జీలకర్ర - 1 టీస్పూన్


వెల్లుల్లి - 10 రెబ్బలు


కరివేపాకు - రెండు రెమ్మలు


ఇంగువ - చిటికెడు


జీడిపప్పు - పదిహేను


ఉల్లిపాయలు - 2 ఉల్లిపాయలు


టమాట - 1 


పసుపు - పావు టీస్పూన్


ఉప్పు - రుచికి తగినంత


కొత్తిమీర - 2 స్పూన్లు


తయారీ విధానం


ముందుగా బియ్యాన్ని కడిగి దానిలో కాస్త నూనె వేసి వండుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నం ముతకగా కాకుండా పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఇలా ఉన్న రైస్ ఫ్రైడ్​ రైస్​గా చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అన్నం సిద్ధమైన తర్వాత ఇప్పుడు ఓ కడాయి తీసుకుని స్టౌవ్ వెలిగించాలి. దానిలో కాస్త నెయ్యి వేసి.. ఎండుమిర్చి, పెప్పర్ వేసి వేయించుకోవాలి. దానిలో జీలకర్ర వేసుకుని అవి కూడా వేయించుకోవాలి. మిరియాలు చిట్లి, ఎండుమిర్చి డార్క్ కలర్​లో మారేవరకు వేయించుకోవాలి. 


ఇలా వేయించుకున్న వాటిని ఓ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో మరికొంత నెయ్యి వేసి వేడి చేయండి. దానిలో పది వెల్లుల్లి రెబ్బలను తొక్కలను తీసి.. కాస్త చిదిమి పక్కన పెట్టుకోవాలి. వాటిలో కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటిలో జీడిపప్పు వేసుకోవాలి. వెల్లుల్లి, జీడిపప్పును ముదురు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కూడా కాస్త వేగిన తర్వాత దానిలో టమోట ముక్కలు వేసుకోవాలి. అవి ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. 



అనంతరం దానిలో ఉడికించిన రైస్ వేసుకుని బాగా కలపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్రను బాగా దంచుకోవాలి. ఈ పొడిని కూడా రైస్​లో వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మళ్లీ వేసుకోవాలి. చివర్లో కొత్తిమీర తురుముతో రైస్​ని గార్నిష్ చేసుకోవాలి. అంతే టేస్టీ, టేస్టీ పెప్పర్ రైస్ రెడీ. దీనిని మధ్యాహ్నం లంచ్​ కోసం సిద్ధం చేసుకోవచ్చు. లేదంటే ఉదయం లేదా మధ్యాహ్నం అన్నం మిగిలిపోతే ఈ టేస్టీ రెసిపీని తయారు చేసుకోవచ్చు.   


కర్రీ లేకుండా టేస్టీగా తినాలనుకున్నప్పుడు దీనిని హాయిగా చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్ కూడా దీనిని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. దీనిలోని జీడిపప్పు పెప్పర్ రైస్ రుచిని మరింత పెంచుతుంది. పైగా సులభంగా దీనిని రెడీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ, స్పైసీ పెప్పర్ రైస్​ని హాయిగా తయారు చేసుకుని.. లాగించేయండి. 


Also Read : మీ వయసుకంటే పెద్దవారిగా కనిపిస్తున్నారా? ఇవి ఫాలో అయితే యంగ్​గా కనిపిస్తారు