Aganampudi Toll Plaza Issue : మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోల్ గేట్ నిర్వహణ పట్ల స్థానికులు గత కొన్నాళ్లుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టోల్ గేట్  తొలగించాలంటూ నాలుగు రోజుల క్రిందట ఆందోళన చేసిన స్థానికులు.. నేషనల్ హైవే అథారిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో బుధవారం రాత్రి పూర్తిగా టోల్ గేట్ తొలగించారు. జీవీఎంసీ పరిధిలో టోల్ గేట్ ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా ఉంటున్న ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. 2019లోనే ఈ టోల్ గేట్ ను తొలగించాలంటూ గాజువాక బార్ అసోసియేషన్, ప్రస్తుత గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాలతో ఈ టోల్ గేట్ ను తొలగించారు. కొన్నాళ్లపాటు ఇక్కడ టోల్ గేట్ సేవలు నిలిచిపోయాయి. నేషనల్ హైవే అథారిటీ అధికారులు హైకోర్టు తీర్పు పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వాదనల అనంతరం మళ్లీ టోల్ గేట్ నిర్వహించుకునేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2019 జూలై, ఆగస్టు నుంచి ఈ టోల్ గేట్ కొనసాగుతూనే ఉంది. 


తొలగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే..


గడిచిన ఎన్నికల్లో ఈ టోల్ గేట్ వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కూటమి అధికారంలోకి వస్తే స్థానికుల డిమాండ్ కు అనుగుణంగా టోల్గేట్ తొలగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ఎంపీలు సహాయంతో సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి టోల్ గేట్ తొలగించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. అనుకున్న విధంగానే కూటమి అధికారంలోకి రావడంతో టోల్ గేట్ తొలగించాలంటూ మంగళవారం నుంచి స్థానికులు ఆందోళన చేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు కూడా నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడారు. అయితే, ఈ లోగానే బుధవారం రాత్రి స్థానికులు ప్రోక్లైన్లు, ఇతర వాహనాలతో వెళ్లి పూర్తిగా టోల్ గేట్ ను ధ్వంసం చేశారు. బూత్ లను తొలగించడంతోపాటు డివైడర్లు,  గోడలను తొలగించి చదును చేశారు. దీంతో ఇక్కడ టోల్ గేట్ నామరూపాలు లేకుండా పోయింది. ఈ వ్యవహారంపై జాతీయ రహదారి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఇక్కడ నెలకొన్న సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. 


పూర్తిగా నిలిచిపోయిన టోల్ వసూళ్లు 


టోల్ గేట్ ను స్థానికులు పూర్తిగా తొలగించడంతో గడిచిన రెండు రోజుల నుంచి ఇక్కడ టోల్ వసూళ్లు నిలిచిపోయాయి. ప్రతిరోజు ఈ టోల్ గేట్ ద్వారా సుమారు రూ.20 లక్షల  వరకు నేషనల్ హైవే అథారిటీకి ఆదాయం లభిస్తోంది.  టోల్ గేట్ ను పూర్తిగా తొలగించడంతో గడిచిన మూడు రోజులు నుంచి ఇక్కడ టోల్ వసూళ్లు నిలిచిపోయాయి. అయితే ఈ టోల్ గేట్ వల్ల స్థానికులు ఇబ్బందులు పడాల్సి వస్తుండడంతో ఎప్పటి నుంచో అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1997లో ఈ టోల్ గేట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. స్థానికులు అభ్యంతరం చెబుతున్నప్పటికీ జాతీయ రహదారుల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో బలవంతంగానే టోల్ గేట్ ను స్థానికులు తొలగించారు. దీనిపై నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. టోల్ గేట్ పూర్తిగా తొలగించడంతో స్థానికులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టోల్ గేట్ ను ధ్వంసం చేసి తొలగించడం ద్వారా నేషనల్ హైవే అథారిటీకి సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.