Telangana News: బీఆర్ఎస్‌కు మరో పెద్ద షాక్ తగిలింది. గులాబీ పార్టీలోని ఒక్కొక్కరు పార్టీ ఫిరాయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్‌లోకి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా కండువా కప్పి కాలె యాదయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో మరికొన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.


కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ పని చేసి 2009లో తొలిసారి చేవెళ్ల నుంచి పోటీచేసి ఓటమి చెందారు. 2014 ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో చేరి.. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. మళ్లీ 2018, 2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌ తరపున పోటీ చేసి వరుసగా గెలుపొదారు. అలా కాలె యాదయ్య 2023 ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు.