Satyabhama Is On This OTT Platform: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన రీసెంట్ మూవీ ‘సత్యభామ’. కాజల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జూన్ 7న థియేటర్లలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. రిలీజ్ అయిన రోజే బాక్సాఫీస్ దగ్గర రూ. కోటి రూపాయలు వసూలు చేసింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కు మానవ అక్రమ రవాణా, ఉగ్రవాదం లాంటి అంశాలను జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కించుకుంది.  ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి అడుగు పెట్టింది. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోనే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకుండానే ఓటీటీలో రిలీజ్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.


అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి..


కాజల్ హిట్ మూవీ ‘సత్యభామ’ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో చూడలేని సినీ అభిమానులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.   ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌ రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌, రవి వర్మ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.  శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్క, బాబి తిక్క నిర్మాతలుగా వ్యవహరించారు.    


ఇంతకీ ‘సత్యభామ’ కథ ఏంటంటే?


సత్యభామ(కాజల్) షీ టీమ్స్ ఏసీపీగా ఉంటుంది. కూల్ గా కనిపించే సత్యభామ నిందితుల నుంచి వాస్తవాలను రాబట్టడంలో నేర్పరి. తనకు అసైన్ చేసే ఏ కేసునైనా తన తెలివి తేటలతో క్లోజ్ చేస్తుంది. ఆమె చేతిలోకి ఓ కేసు ఫైల్ వెళ్లిందంటే నూటికి నూరు శాతం సాల్వ్ అవుతుందనే టాక్ డిపార్ట్ మెంట్ లో ఉంటుంది. రైటర్ అమరేందర్(నవీన్ చంద్ర)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే, పర్సనల్ లైఫ్ కంటే డ్యూటీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అదే సమయంలో హసీనా అనే మహిళ గృహహింసను ఎదుర్కొంటుంది. ఎలాగైనా తనకు సాయం చేయాలని సత్యభామను కోరుతుంది. విషయం తెలిసి హసీనాను ఆమె భర్త కిరాతకంగా చంపేస్తాడు. హసీనాతో పాటు ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేసిన ఆ దుర్మార్గుడిని పట్టుకునేటప్పుడు సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని దాటుకుని ఆమె ఈ కేసును ఎలా క్లోజ్ చేసింది? అనేది సినిమాలో చూపించారు.  


వరుస సినిమాలతో ఫుల్ బిజీ


పెళ్లి తర్వాత కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్, గత ఏడాది సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. బాలయ్యతో కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ కొట్టడంతో మళ్లీ ఆమె ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అటు మంచు విష్ణు ‘కన్నప్ప‘ సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 



Read Also: ముంబైలో మరో లగ్జరి అపార్ట్‌మెంట్‌ కొన్న ఆమీర్ ఖాన్ - దాని ధర ఎన్ని కోట్లో తెలుసా?