celebs congratulate Team India for T20 World Cup semi-finals win: వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన ఏడాదిలోపే టీమిండియా(Team India) మరోసారి టీ 20 ప్రపంచకప్‌( T20 World Cup) ఫైనల్‌ చేరడంపై దిగ్గజ క్రికెటర్లు... బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖుల ట్వీట్లతో సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది. క్రికెట్‌ గాడ్‌ సచిన్ టెండూల్కర్‌ దగ్గరి నుంచి బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ వరకూ అందరూ ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయాన్ని అద్భుతమంటూ కొనియాడారు. రోహిత్‌ సేన ఈసారి పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడం ఖాయమంటూ లెజెండ్స్‌ అంచనా వేస్తున్నారు. ఇంగ్లాండ్‌ను స్పిన్‌ వలలో చిక్కేలా చేసి టీమిండియా ప్రతీకారం తీర్చుకుందని ప్రముఖులు ట్వీట్‌లు చేశారు.


 

సమష్టి విజయం ఇది...

ఛాలెంజింగ్ పిచ్‌పై భారత్‌ అన్ని విభాగాల్లోనూ రాణించి మంచి విజయం అందుకుందని సచిన్‌ టెండూల్కర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 171 పరుగులు చేసిందని.. ఈ పిచ్‌పై అది అంత చిన్న లక్ష్యమేమి కాదని క్రికెట్‌ గాడ్‌ అన్నాడు. అక్షర్‌ పటేల్‌ బట్లర్‌ను అవుట్‌ చేయడమే ఈ మ్యాచ్‌కు కీలకమైన మలుపని సచిన్‌ అన్నాడు. కుల్‌దీప్‌-అక్షర్‌ కలిసి ఇంగ్లాండ్‌ను లక్ష్యానికి దూరం చేశారని ట్వీట్‌ చేశాడు. భారత్‌ బౌలింగ్‌తో బ్రిటీష్‌ జట్టు అసలు లక్ష్యం దిశగానే పయనించలేదని టెండూల్కర్‌ తెలిపాడు.





 

టీ 20 ప్రపంచకప్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని మాజీ ఆటగాడు రాబిన్‌ ఊతప్ప ట్వీట్‌ చేశాడు. అక్షర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని, కుల్‌దీప్‌, బుమ్రా ఈ విజయంలో కీలక పాత్ర పోషించారని ఊతప్ప అన్నాడు. టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన వల్లే ఈ అద్భుతమైన విజయం సాధ్యమైందని... ఫైనల్‌ చేరిన జట్టుకు అభినందనలు అంటూ ఊతప్ప ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనను మహమ్మద్ కైఫ్ కొనియాడాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, వ్యూహ రచనలోనూ టీమిండియా అద్భుతంగా ఉందని కైప్‌ ప్రశంసించాడు. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకోవడం పూర్తయిందని... ఆకాశ్ చోప్రా ట్వీట్‌ చేశాడు. 





 

వాన్‌కు అశ్విన్‌ దిమ్మతిరిగే రిప్లై

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ భారత్‌కే అనుకూలంగా ఉంటుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇప్పటికే చాలాసార్లు వ్యాఖ్యానించాడు. భారత్‌కు అనుకూలంగానే ఐసీసీ షెడ్యూల్‌ ఉంటుందని కూడా ఆరోపించాడు. అయితే నిన్న ఇంగ్లాండ్‌పై ఇండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత వాన్ మరో పోస్ట్‌ చేశాడు. భారత్ ఫైనల్‌కు చేరుకోవడానికి పూర్తిగా అర్హమైన జట్టని... ఈ మెగా టోర్నమెంట్‌లో అత్యుత్తమ జట్టు భారతే అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. పిచ్‌లు భారత్‌కు అనుకూలంగా ఉంటాయని.. ఇలాంటి పిచ్‌లపై ఇంగ్లండ్‌కు ఎప్పుడూ కష్టపడుతోందని. స్లో పిచ్‌లపై భారత్‌ మెరుగ్గా ఉంటుందని వాన్‌ కామెంట్స్‌ చేశాడు. ఈ కామెంట్స్‌కు అశ్విన్‌ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు.  టీమిండియా గెలుపును చాలా మంది రాకెట్ సైన్స్ చూసినట్లు చూస్తున్నారంటూ వాన్‌కు అశ్విన్‌ ఇట్టి పడేశాడు. ఓ గణిత సమస్యను పోస్ట్ చేసిన అశ్విన్‌... టీమిండియా గెలిచిన తర్వాత కొందరి నిపుణుల లెక్కంటూ ఎద్దేవా చేసి గట్టిగా బదులిచ్చాడు. 





 

బాలీవుడ్‌ ప్రముఖులు కూడా...

 టీమిండియా విజయంపై బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.


వరుణ్ ధావన్, ఆయుష్మాన్ ఖురానీ టీమిండియా గెలుపు తర్వాత సంబరాలు చేసుకున్నారు. వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని కోల్పోయిన భారత్‌ ఏడాదిలోనే ఆస్ట్రేలియాకు... రెండేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకుందని వరుణ్ ధావన్ పోస్ట్‌ చేశాడు.