Delhi Railway Job Fraud: డిగ్రీలు, బీటెక్‌లు పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం వెతుకుతున్న యువతే లక్ష్యంగా ఎన్నో ఘరానా మోసాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల పేరుతో వారి దగ్గర నుంచి డబ్బులు లాగేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి వార్తలు మనం రోజూ ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నాం. కానీ ఇది మాత్రం అంతకుమించి. రైల్వే శాఖలో లేని ఉద్యోగాన్ని కేటుగాళ్లు సృష్టించి.. దాని కోసం నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.2.6 కోట్లు స్వాహా చేశారు.
ఇదీ సంగతి
రైల్వేల్లో ఉద్యోగాల పేరుతో ఓ మోసగాళ్ల గ్యాంగ్ నిరుద్యోగులకు వల వేసింది. 28 మందిని నెల రోజుల పాటు శిక్షణ పేరుతో దిల్లీ రైల్వే స్టేషన్‌లో బోగీలు లెక్కించేందుకు కూర్చోబెట్టారు.
‘‘రోజుకు 8 గంటల పని.. స్టేషన్‌కు ఎన్ని రైళ్లు వస్తున్నాయో.. ఎన్ని వెళ్తున్నాయో.. వాటికి బోగీలు ఎన్ని ఉన్నాయో లెక్కించాలి. టీటీఈ, క్లర్క్‌ల ఉద్యోగాల కోసం ఈ శిక్షణ తీసుకోవాలి. తర్వాత జాబ్ గ్యారెంటీ’’ అంటూ నమ్మబలికారు. ఈ మాటలు నమ్మిన వారి నుంచి ఏకంగా రూ.2.67 కోట్లు వసూలు చేశారు. చివరికి మోస పోయామని తెలుసుకున్న బాధితులు.. పోలీసు కంప్లెయింట్ ఇచ్చారు. అప్పుడే ఈ హైటెక్ కుంభకోణం బయటపడింది.
అంతా మనదే
తమిళనాడుకు చెందిన 78 ఏళ్ల సుబ్బుసామి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. కొన్ని నెలల కిందట ఆయనకు దిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌లో కోయంబత్తూరుకు చెందిన శివరామన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు ఎంపీలు, మంత్రులు బాగా తెలుసని, రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు.
అతని మాటలు నమ్మిన సుబ్బుసామి తనకు తెలిసిన ముగ్గురు యువకులను దిల్లీకి తీసుకొచ్చారు. ఈ విషయం మదురైలోని చాలా మందికి తెలిసి మరో 25 మంది ఉద్యోగాల కోసం సుబ్బుసామిని కలిశారు. వీరిని తీసుకుని ఆయన దిల్లీ వెళ్లారు.
మరోవ్యక్తికి
ఆ నిరుద్యోగులను శివరామన్.. వికాస్ రాణా అనే వ్యక్తికి పరిచయం చేశాడు. ఉత్తర రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానంటూ రాణా వారిని మోసగించాడు. రైల్వేలో టీటీఈ, ట్రాఫిక్ అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఆ వ్యక్తి వసూలు చేశాడు. వైద్య పరీక్షలు, పత్రాల తనిఖీ అంటూ కొన్ని ఫార్మాలటీస్ పూర్తి చేశాడు. తర్వాత ఫోర్జరీ పత్రాలతో శిక్షణ ఆర్డర్లు ఇచ్చాడు. ఐడీ కార్డులు కూడా ఇచ్చేశాడు.
నెల రోజులు
ఆ తర్వాత 28 మంది యువకులకు నెల రోజుల పాటు దిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో శిక్షణ కూడా ఇప్పించాడు. రోజుకు 8 గంటల పాటు స్టేషన్‌కు వచ్చేపోయే రైళ్లను, వాటి బోగీలను లెక్కించాలని, ఆ ఉద్యోగాలకు ఇదే శిక్షణ అని నమ్మబలికాడు. ఈ ఏడాది జూన్-జులైలో నెల రోజల పాటు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి అపాయింట్‌మెంట్ లెటర్లు కూడా జారీ చేశాడు.
వాటిని పట్టుకుని రైల్వే అధికారుల వద్దకు వెళితే.. అవి ఫోర్జరీ పత్రాలని తేలింది. దీంతో తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న ఆ 28 మంది సుబ్బుసామిని ఆశ్రయించారు. దీంతో ఆయన దిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Shopian Encounter: సోపియాన్‌లో భారీ ఎన్‌కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం