నేడు టీ.కాంగ్రెస్ నేతల భేటి
తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఇంకా ఇంటిపోరు కొనసాగుతూనే ఉంది. మొన్న భట్టి నివాసంలో భేటి అయిన G-9నేతలు మరోసారి ఇవాళ భేటి కానున్నారు. ఈ భేటిలో ప్రధానంగా పార్టీని ఏలా కాపాడుకోవాలి, వలస నేతలనుంచి పార్టీలో మొదటినుంచి ఉన్న నేతలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి? కాంగ్రెస్ సిధ్దాంతాలను పీసీసీ ఛీఫ్ ఎందుకు పక్కన పెట్టి ఒంటెద్దు పోకడలు పోతున్నారనే విమర్శలపైన చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశానికి ఉత్తమ్ మినహా మిగిలిన నేతలందరూ సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసంలో నేతలంతా భేటి అవుతున్నట్లు సమాచారం.
ఢిల్లీ కి చేరిన తెలంగాణ సీనియర్, జూనియర్ ల పంచాయతీ
తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ ఢిల్లీకి చేరింది. పదవుల కేటాయింపులపై సీనియర్ల విమర్శలు, గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విభేధాలపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రియాంక గాంధీ ఏఐసీసీ సెక్రటరీ నదీమ్‌కు ఫోన్ చేసి తెలంగాణ కాంగ్రెస్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఆరా తీశారు. సీనియర్లకు-రేవంత్ వర్గానికి మధ్య విభేదాలకు కారణాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లతో త్వరలో భేటి అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక చెప్పినట్టే సమావేశానికి దూరంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా.. వాట్ నెక్స్ట్ అన్న అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఇదే విషయంపై చర్చించేందుకు ఇవాళ మహేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ కానున్నారు. అంతేకాదు రేపు ఢిల్లీ వెళ్లే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఇలాంటి విభేదాలు సర్వ సాధారమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమస్యలను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానన్న ఆయన ఈ విభేదాలు తాత్కాలికమేనని, రేవంత్ రెడ్డి పాదయాత్రను స్వాగతిస్తున్నానని చెప్పారు. అటు కాంగ్రెస్ సీనియర్లు బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానం పలికిన రాజగోపాల్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ వర్గానికి చెందిన సీనియర్ నేత మల్లు రవి. కక్కూర్తి పడి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.పార్టీలో ఉంటూ సీనియర్లను ఆధారాలు లేకుండా కోవర్టులు అనడం తప్పని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. పీసీసీ, సీఎల్పీలను అధిష్టానం అనుక్షణం గమనిస్తోందని, తప్పొప్పులు బయటకు తెలియాల్సినవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ లుకలుకలకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాల్సిందే.
నేడు మరోసారి ఈడీ విచారణకు MLA రోహిత్ రెడ్డి!
మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ అధికారుల విచారణకు సోమవారం హాజరయ్యారు. తొలి రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి కంటిన్యూగా ఆరు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానాల అనంతరం స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. మరోసారి మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా రోహిత్‌రెడ్డిని ఈడీ ఆఫీసర్లు ఆదేశించారు. విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పిన రోహిత్‌రెడ్డి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు మీడియాకు వివరించారు. వ్యక్తిగతమైన వివరాలతో పాటు కుటుంబ సభ్యుల గురించి, మొత్తంగా తాము చేస్తున్న వ్యాపారాల గురించి అధికారులు వివరాలు తీసుకున్నారని పైలట్ వివరించారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించినా నిర్ధిష్టంగా ఏ కేసుకు సంబంధించి విచారణకు పిలిచారో తనకు అర్థం కాలేదని, ఇదే విషయాన్ని అధికారులను వివరణ అడిగినా చెప్పలేదని మీడియాకు పైలట్ తెలిపారు. ఈడీ నుంచి ఈ నెల 15న నోటీసు అందినప్పటి నుంచి ఏ కేసుకు సంబంధించి విచారణకు రావాలని ఆదేశించిందీ తెలియదని, ఆతృతగా ఉందంటూ అధికారులకు మొరపెట్టుకున్నా సరైన జవాబు రాలేదని విచారణ తర్వాత బైటకు వచ్చిన రోహిత్ రెడ్డి మీడియాకు వివరించారు. నిర్దిష్ట ఫార్మాట్‌లో బయోడేటా తీసుకురావాల్సిందిగా తనకు ఆ నోటీసుల్లో వివరించారని, దాన్ని వెంట తీసుకెళ్ళానని, అందులోని వివరాల గురించే ఎక్కువగా ప్రశ్నించారని తెలిపారు.ఇప్పటివరకు తనమీద ఈడీ తరఫున ఎలాంటి కేసు నమోదుకాలేదని, ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు సంబంధించి కూడా ఆరోపణలు రాలేదని, ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని, అయినా ఈడీ ఎందుకు పిలిచిందో ఆరు గంటల విచారణ తర్వాత కూడా తనకు బోధపడలేదని అన్నారు.
మనీ లాండరింగ్ ఆరోపణలు అంటూ నోటీసులో పేర్కొన్నా దానికి సంబంధించి ఆరు గంటల విచారణలో ఒక్క ప్రశ్న కూడా అడలేదన్నారు. వ్యాపారాలు, అందులోని పెట్టుబడులు, ఆర్థిక అంశాల గురించి మాత్రం లోతుగా ప్రశ్నించారని, తన దగ్గర ఉన్న సమాధానాలను చెప్పానని తెలిపారు. న్యాయ వ్యవస్థపైన తనకు నమ్మకం ఉన్నదని వ్యాఖ్యానించిన రోహిత్‌రెడ్డి లీగల్ ఒపీనియన్‌ను తీసుకుంటానని తెలిపారు. మంగళవారం విచారణకు హాజరవుతారా అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు పై విధంగా బదులిచ్చారు.దీంతో మంగళవారం విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ నోటీసుల ప్రకారం సోమవారం ఉదయం పదిన్నరకే జోనల్ ఆఫీసులో జరిగే విచారణకు హాజరుకావడానికి మణికొండలోని నివాసం నుంచి బయలుదేరినా మధ్యలో ముఖ్యమంత్రి నుంచి ఫోన్ రావడంతో ప్రగతి భవన్‌కు వెళ్ళారు. ఆ తర్వాత న్యాయవాది సూచనల మేరకు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శ్రావణ్ ద్వారా గడువు కోరుతూ ఈడీకి పర్మిషన్ లెటర్ పంపారు. కానీ దాన్ని ఈడీ ఆఫీసర్లు నిరాకరించడంతో మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 31 వరకూ గడువు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి చుక్కెదురైంది. అనివార్య పరిస్థితుల్లో విచారణకు హాజరుకావడంతో మంగళవారం ఉదయం పదిన్నర గంటల విచారణ సమయానికి ఎలాంటి మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొన్నది.
నేడూ ఆశా వర్కర్ల నిరసన.
నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు 48 గంటల నిరసనకు దిగారు. వంటావార్పు కార్యక్రమాలు చేస్తున్నారు. రెండో రోజు తమ దీక్ష కొనసాగిస్తున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
జనగామలో టెన్షన్, నేడు ఏం జరుగుతుందో.
కొత్త పంథాలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు... పోలీసులు వచ్చి ఎప్పుడు తొలగిస్తారో అంటూ టెన్షన్ టెన్షన్. జనగామ జిల్లాలో సరికొత్త పంథాలో ఇంటిస్థలం కోసం కమ్యూనిస్టు పార్టీల నేతృత్వంలో పేదలు భూ పోరాటానికి దిగారు. జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలం పటేల్ గూడెం శివారులో ఒకేరోజు సుమారు ఐదు వేల గుడిసెలు వెలిశాయి. గుడిసెవాసుల ఆక్రమణ మేడారం మహా జాతరను తలపిస్తోంది. సర్వే నెంబర్ 464, 465, 466లోని ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఒకేసారి వేలాదిగా వచ్చి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడంతో జిల్లా అధికార యంత్రాంగం అయోమయంలో పడింది. పోలీసులు ఉన్నత అధికారుల ఆదేశాలతో తొలగిస్తారు అంటూ జనగామ లో టెన్షన్ నెలకొంది.
నేడు సెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పొన్నం ప్రభాకర్.
ఒకప్పుడు తన హవా నడిచిన సిరిసిల్ల సెస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది.
కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ తో కలిసి వేములవాడ నియోజకవర్గం లో ఈ రోెజు సెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 08.30 గం|| లకు లింగంపల్లి హనుమాజీపేట బొల్లారం (గ్రా) వేములవాడ రూరల్ (మం) లోనూ...ఉదయం 10.30 గం|| లకు మూడపల్లి (గ్రా) చందుర్తి (మం)లో, ఉదయం 11.30 గం|| లకు రుద్రంగి (మం)లో మధ్యాహ్నం 03.00 గం|| లకువేములవాడ పట్టణంలో...సాయంత్రం 05.00 గం|| లకు చంద్రగిరి (గ్రా) వేములవాడ అర్బన్ (మం) లో పాల్గొననున్నారు. మంత్రి కేటీఆర్ కి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ అభ్యర్థిని నిలబెడుతున్నాయి